సన్నబియ్యం పంపిణీలో చేతివాటం .. తూకంలో తరుగు వస్తుందని దగా చేస్తున్న డీలర్లు

సన్నబియ్యం పంపిణీలో చేతివాటం .. తూకంలో తరుగు వస్తుందని దగా చేస్తున్న డీలర్లు

వనపర్తి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పంపిణీలో రేషన్​ డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. లబ్ధిదారుడి సంచితో పాటు గోనె సంచిని ఎలక్ట్రానిక్​ కాంటాపై పెట్టి తూకం వేస్తున్నారు. నలుగురు సభ్యులు ఉన్న కార్డుదారుడికి ఇలా కిలో వరకు తక్కువ బియ్యం ఇస్తున్నారు. ఇదేమని నిలదీస్తే తమకు వచ్చే బియ్యం సంచుల్లో నాలుగైదు కిలోల వరకు తరుగు వస్తోందని, ఆ నష్టాన్ని భరించేందుకు ఇలా చేస్తున్నామని చెబుతున్నారు.

పక్కదారి పట్టే అవకాశం లేకనే..

గతంలో రేషన్​ షాపుల ద్వారా పంపిణీ చేసే దొడ్డు బియ్యాన్ని ఎక్కువ శాతం మంది లబ్ధిదారులు డీలర్లకు కిలో రూ.10కి అమ్ముకునేవారు. అలా అమ్మేవారి లిస్ట్​ తయారు చేసి కార్డుదారుల వేలిముద్రలు వేయించుకొని డబ్బులు ఇచ్చేవారు. 

ఆ బియ్యాన్ని కిలో రూ.22 చొప్పున రీసైక్లింగ్​ చేసే రైస్​ మిల్లులకు అమ్ముకునేవారు. ప్రస్తుతం సన్న బియ్యం పంపిణీ చేస్తుండడం, వాటిని లబ్ధిదారులు తీసుకోవడంతో బియ్యాన్ని పక్కదారి
పట్టించే అవకాశం లేకుండాపోయింది. దీంతో డీలర్లు తరుగు పేరుతో కోతలు పెడుతూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇలా క్వింటాలు బియ్యం పంపిణీ చేస్తే అందులో 5 కిలోల వరకు 
కాజేస్తున్నారు.

ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లాం..

ప్రతి నెలా వచ్చే బియ్యం సంచుల్లో రెండు, మూడు కిలోల దాకా తరుగు వస్తోంది. లోడింగ్, అన్​ లోడింగ్​ సమయంలోనూ కొంత లాస్​ వస్తోంది. తరుగు రాకుండా చూడాలని ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్తే, తూకం వేసి సప్లై చేస్తామని చెబుతున్నా, అలా జరగడంలేదు. ఆఫీసర్లు తరుగు రాకుండా చూస్తే ఈ సమస్య ఉండదు.-  బచ్చురాము, రేషన్​ డీలర్ల సంఘం అధ్యక్షుడు, వనపర్తి