తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డీలర్లు ఆందోళన చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రేషన్ డీలర్ల న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని రేషన్ డీలర్లు కలెక్టర్ కు వినతీ పత్రం అందజేశారు. అంతకుముందు రగుడు చౌరస్తా నుంచి సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు రేషన్ డీలర్లు ర్యాలీ తీశారు. జూన్ 5వ తేదీ లోపు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రేషన్ డీలర్ల గౌరవ వేతనం 30 వేలు చెల్లించాలని.. మూడు నెలలుగా నిలిచిపోయిన కమిషన్ ను విడుదల చేయాలని తెలిపారు.
రేషన్ షాపులను మినీ సూపర్ మార్కెట్లుగా గుర్తించి మరిన్ని నిత్యావసర సరుకులు అందుబాటులోకి తేవాలన్నారు. గన్ని బ్యాగ్స్ రూ. 30 కి పెంచాలని డిమాండ్ చేశారు. జూన్ 4వ తేదీ లోపు రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కారం చేయాలని.. లేకపోతే జూన్ 5 నుంచి రేషన్ షాపులు మూసేస్తామని హెచ్చరించారు.
మరోవైపు ఇప్పటికే వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఏప్రిల్ నెలలోనే పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్‌కు తెలంగాణ రేషన్ డీలర్ల సంఘం అందజేసింది. జూన్ 5 నాటికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే.. రేషన్ డీలర్లు సమ్మెకు దిగాలని నిర్ణయించారు. నిబంధనల ప్రకారం 45రోజులు ముందుగానే కమిషనర్‌కు డిమాండ్ నోటీసు అందజేశామని డీలర్లు తెలిపారు.