రేషన్ బియ్యం దందా.. వయా కరీంనగర్ 

రేషన్ బియ్యం దందా.. వయా కరీంనగర్ 
  • జిల్లాల మీదుగా ఇతర రాష్ట్రాలకు రవాణా
  • పక్క జిల్లాల నుంచి వస్తూ జిల్లాలో చిక్కుతున్న లారీలు

కరీంనగర్, వెలుగు : జిల్లా మీదుగా రేషన్ బియ్యం రవాణా  ఆగడం లేదు. ఉమ్మడి జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట రేషన్ బియ్యం బస్తాలు టాస్క్ ఫోర్స్ అధికారులు, పోలీసులకు చిక్కుతున్నాయి. గత వారం పది రోజుల్లో  రోజుల్లో 3 చోట్ల  మానకొండూరు నియోజకవర్గ పరిధిలో బియ్యం లారీలు పట్టుబడ్డాయి. ఈ నెల 4న శంకరపట్నం మండలం వంకాయ గూడెంలో 40 క్వింటాళ్లు, మానకొండూరులో ఈ నెల 5న 299 క్వింటాళ్లు, తిమ్మాపూర్ మండలం రేణి కుంట టోల్ ప్లాజా వద్ద ఈ నెల 8న 452.30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్, పోలీసులు పట్టుకున్నారు. ఈ మూడు చోట్ల ముందస్తుగా అందిన పక్కా సమాచారంతో పట్టుకున్నవేకాగా.. పోలీసులు, టాస్క్ ఫోర్స్ కళ్లుగప్పి సరిహద్దులు దాటుతున్న బియ్యం లారీలు పదుల సంఖ్యలో ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. 

ఇంటింటా బియ్యం సేకరణ.. 

ఉమ్మడి జిల్లాలో 413 రేషన్ దుకాణాల ద్వారా నెలకు 3,500 క్వింటాళ్ల బియ్యాన్ని లబ్దిదారులకు సరఫరా చేస్తున్నారు. 2,21,956 రేషన్ కార్డులు ఉండగా 6,40,250 మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రభుత్వం రేషన్ షాపుల్లో ఫ్రీగా ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడడం లేదు. కొందరు దోసెలు, ఇడ్లీ పిండి, ఇతర పిండి వంటలకు కొంత వినియోగిస్తున్నప్పటికీ.. చాలా మంది బయటే రూ.7, రూ.8 కిలో చొప్పున అమ్మేస్తున్నారు. కొందరు వ్యక్తులు బియ్యం కొనడమే ఉపాధిగా మార్చుకుని  బైక్ లు, ఆటోల్లో ఇంటింటికి తిరుగుతున్నారు.

కొందరైతే ఏకంగా రేషన్ షాపుల వద్దే అడ్డా పెట్టి  అక్కడే కొనేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన వ్యక్తులు ఆ బియ్యాన్ని మొత్తం ఒక దగ్గర పోగు చేసి.. ఇతర రాష్ట్రాలకు బియ్యం తరలించే పెద్ద వ్యాపారులకు రూ.12 నుంచి రూ.15 వరకు అమ్మేస్తున్నారు.  అయితే గతంలో కరీంనగర్ జిల్లాలోని జోరుగా సాగిన ఈ రేషన్ బియ్యం దందా కొన్నాళ్లుగా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు ఎక్కువగా పక్క జిల్లాల నుంచి తరలిస్తున్న రేషన్ బియ్యమే కరీంనగర్ జిల్లాలో చిక్కుతున్నాయి. గ్రామాల్లో సేకరించిన బియ్యాన్ని కొందరి ఇళ్లల్లో నిల్వ చేసి, రాత్రి వేళల్లో రహస్యంగా 
తరలిస్తున్నారు. 

ఇతర రాష్ట్రాలకు, సీఎంఆర్ కు.. 

గ్రామాల్లో సేకరించిన బియ్యాన్ని కొందరు వ్యాపారులు రైస్ మిల్లు ఓనర్లకు అమ్మేస్తున్నారు. ఇటీవల చాలా చోట్ల సీఎంఆర్ కోసం ఇచ్చిన వడ్లను కొందరు రైస్ మిల్లర్లు పక్కదారి పట్టించిన విషయం తెలిసిందే. వారి దగ్గర ప్రస్తుతానికి వడ్లు లేకపోవడం, సీఎంఆర్ విషయంలో సర్కార్ ఒత్తిడి పెరగడంతో సదరు వ్యాపారులు రేషన్ బియ్యం కొనుగోలు చేసి.. తిరిగి వాటినే ఎఫ్ సీఐకి అప్పగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

అంతేగాక మరికొందరు కాళేశ్వరం మీదుగా సిరొంచ అటు నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వరకు ఎక్స్ పోర్ట్ చేస్తున్నట్లు తెలిసింది. కొందరు పెద్దపల్లి, రామగుండం, జమ్మికుంట రైల్వేస్టేషన్లకు బియ్యం బస్తాలను చేర్చి అక్కడి నుంచి రైలులో వేసి తరలిస్తున్నారు. రోడ్డు మార్గంలో లారీలు, డీసీఎంల్లో రవాణా చేస్తూ చెక్ పోస్టు సిబ్బందిని మేనేజ్ చేస్తూ సరిహద్దులు 
దాటిస్తున్నారు. 

బియ్యం పట్టివేత.. 

గన్నేరువరం/ వీణవంక :  గన్నేరువరం,   వీణవంక మండలంలో  అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని శనివారం అధికారులు పట్టుకున్నారు. 
గన్నేరువరంలోని  గునుకులకొండాపూర్ చీమలకుంటపల్లి గ్రామాల  మధ్య  వరద కాలువ సమీపంలో శనివారం ఉదయం అక్రమంగా నిలువ చేసిన ఏడు క్వింటాళ్ల పీడీఎస్​  బియాన్ని  ఎస్సై తాండ్ర నరేశ్​ పట్టుకుని సీజ్ చేశారు.

బియ్యం అక్రమంగా నిలువ చేసిన బత్తుల లచ్చయ్య పైన కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.  వీణవంక మండలంలోని వివిధ గ్రామాల నుండి సేకరించిన రేషన్ బియ్యాన్ని ఆటో ద్వారా ఐదు కింటాల బియ్యాన్ని సుల్తానాబాద్ కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.  చింతల కిరణ్ అనే వ్యక్తి రేషన్ బియ్యాన్ని రూ. 12  చొప్పున కొనుగోలు చేసి సుల్తానాబాద్ లోని ఓ పౌల్ట్రీ వ్యాపారికి రేషన్ బియ్యాన్ని అధిక ధరలకు విక్రయించేందుకు ఆటోలో తీసుకెళ్తుండగా మాములాలపల్లి వద్ద పట్టుకున్నట్లు ఎస్సై తోట తిరుపతి తెలిపారు. ఆటోతోపాటు బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. 

సర్కార్ సన్నబియ్యం ఇస్తేనే పరిష్కారం..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల ఆకలి తీర్చేందుకు రేషన్ బియ్యాన్ని నెలనెలా ఫ్రీగా ఇస్తున్నారు. అయితే అవి దొడ్డు బియ్యం కావడంతో చాలా మంది వండుకుని తినేందుకు ఇష్టపడడం లేదు. అందుకే ప్రభుత్వమే సన్నబియ్యం ఇస్తే బియ్యం దందాకు చెక్ పడే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం తాజాగా సన్నరకాల వడ్లకే బోనస్ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో సన్న వడ్ల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ సారి సీఎంఆర్ కు అప్పగించే వడ్లు సన్న రకాలే ఎక్కువగా ఉంటే.. ఎఫ్ సీఐ ద్వారా రేషన్ షాపులకు సన్న బియ్యమే వచ్చే అవకాశముంది. అదే జరిగితే రేషన్ బియ్యం దందాకు చెక్ పెట్టొచ్చని  సివిల్ సప్లై ఆఫీసర్లు అభిప్రాయపడుతున్నారు.