- లబ్ధిదారుల నుంచి నేరుగా కొనుగోలు
- ఇతర ప్రాంతాలకూ అక్రమ రవాణా
వనపర్తి, వెలుగు: పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం జిల్లాలో పందుల దాణాగా మారుతోంది. అక్రమంగా సేకరించిన బియ్యాన్ని వ్యాపారులు మొన్నటి వరకూ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు. ఇప్పుడు పందుల వ్యాపారులకు అమ్ముతున్నారు. దీంతో రేషన్ బియ్యం కాస్తా.. పందుల దాణాగా మారుతోంది.
దారిమల్లుతున్న బియ్యం..
జిల్లాలో 1.54లక్షల రేషను కార్టులున్నాయి. 324 రేషను షాపుల ద్వారా 2510 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణి చేస్తున్నారు. రేషన్ షాపుల నుంచే బియ్యం ప్రైవేటు వ్యాపారుల చేతిలోకి వెళ్తున్న ఘటనలు ఉన్నాయి. వారు అక్రమంగా రాష్ట్రాలను దాటిస్తున్నారు. దీంతో పాటు కొంతమంది లబ్ధిదారులే తాము తీసుకున్న బియ్యాన్ని రూ. 13 నుంచి 15 వరకు గ్రామాల్లో పందుల వ్యాపారులకు అమ్మతున్నారు. గతంలో రేషన్ మధ్యవర్తుల ద్వారా రైసుమిల్లర్లకు, బయటి రాష్ట్రాల వారికి అందేది. కొందరు రేషన్ షాపు నుంచి మాట్లాడుకుని బ్లాక్ మార్కెట్లోకి తరలించే వారు. జిల్లా కేంద్రంలోని పలు రేషన్ షాపు డీలర్లు కార్డు హోల్డర్లతో మాట్లాడి వారి నుంచి వేలిముద్రలు వేసుకుని పంపిణీ చేసినట్లుగా రిజిష్టర్ చేసి, కిలోకు రూ.10ల చొప్పున బయటి వాళ్లకు ఇస్తున్నారు.
ఎక్కడికక్కడే సేకరణ...
పట్టణాలు, గ్రామాల్లో రేషనుకార్డు హోల్డర్ల నుంచి మధ్యవర్తులు బియ్యం కొనుగోలు చేస్తున్నారు. కార్డుదారుల నుంచి ఎక్కువ రేటుకు కొంటున్నారు. కొనుగోలు చేసిన వారు ఇండ్లలో క్వింటాళ్ల కొద్దీ నిలువ ఉంచి, పందుల పెంపకం దారులకు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. కొందరు వ్యాపారులు ఒక్కో క్వింటాళ్ల బియ్యం తీసుకెళ్తున్నారు. ఇలా పందులవాళ్లకు రేషన్ బియ్యం చేరుతుండగా.. మరోవైపు రైసుమిల్లర్లకు అమ్మడమూ ఆగిపోలేదు.
చర్యలు తీసుకుంటున్నాం..
ఎక్కడ రేషన్ బియ్యం నిల్వలున్నాయని తెలిసినా దాడులు చేసి కేసులు చేస్తున్నాం. కార్డు హోల్డర్స్ ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని అమ్ముకోవడం నేరం. అమ్మినట్లు తెలిస్తే వారిపైనా కేసులు నమోదు చేస్తాం. ఎన్నో పోషకాలున్న రేషను బియ్యాన్ని తామే వినియోగించుకోవాలి. ఇప్పటికే దాడులు ముమ్మరం చేశాం. ఇంకా కొనసాగిస్తాం.
శ్రీనాథ్, జిల్లా సివిల్ సప్లయి ఆఫీసర్, వనపర్తి