పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం

  • దళారులను ప్రోత్సహిస్తున్న మిల్లర్లు

రాజన్న సిరిసిల్ల, వెలుగు: జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బలహీన వర్గాల కోసం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం దళారులకు అమ్ముకుంటున్నారు.  కొవిడ్​ నుంచి కేంద్ర ప్రభుత్వం  వీకర్ సెక్షన్ కు ఉచితంగా బియ్యాన్ని అందిస్తోంది. రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులకు బియ్యానికి బదులు డబ్బులు ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. లబ్ధిదారుల నుంచి కొంత డబ్బులు ముట్టజెప్పి  పేదల బియ్యాన్ని  డీలర్లు  రైస్  మిల్లులకు తరలిస్తున్నారు.  మిల్లర్లు హైదరాబాద్​ పౌల్ట్రీ పరిశ్రమలకు తరలిస్తున్నారు. 

రూ. 5 లక్షల లబ్ధిదారులు 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 344  రేషన్ దుకాణాలు,1,74,115 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 4,99,914 మంది లబ్ధిదారులు ఉన్నారు. అంత్యోదయ కార్డులు,13,509 ఉండగా,34,673 మంది లబ్ధిదారులు, ఆహార భద్రత కార్డులు 160,401 ఉండగా,4,65,027 మంది లబ్ధిదారులు ఉన్నారు.  అన్నపూర్ణ కార్డులు 231 ఉండగా ఉండగా 214 మంది లబ్ధిదారులు  ఉన్నారు. వీరికి ప్రతి నెల బియ్యాన్ని అలాట్ చేస్తున్నారు. ఇందులో బియ్యం ఎక్కువ శాతం పక్కదారి పడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. 

పట్టుబడుతున్న బియ్యం

జిల్లాలో అక్రమంగా తరులుతున్న బియ్యం నిత్యం ఎక్కడో చోట పట్టుకుంటున్నారు.  గత జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్తాప్తంగా 11 కేసులు నమోదు చేశారు. 29 మందిని రిమాండ్ కు పంపారు. 110 క్వింటాళ్ల బియ్యాన్ని టాస్క్​ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.  అక్రమంగా తరలిస్తున్న  బియ్యాన్ని పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నా అక్రమ రవాణా ఆగడం లేదు. ఏప్రిల్ నెలలోనే ముస్తాబాద్ మండలం మోయిన్ కుంటలో ఆటలో 23 క్వింటాళ్ల బియ్యం తరలించే క్రమంలో టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. బోయిన్ పల్లి మండల శివారులో బొలెరో లో 15 క్వింటాళ్లు, ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ లో 6  క్వింటాళ్లు,  సిరిసిల్ల రగుడు వద్ద15 క్వింటాళ్లు పట్టుబడ్డాయి. జిల్లాలోని తంగళ్లపల్లి, వేములవాడ, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, బోయిన్పల్లి, ఇల్లంతకుంట బియ్యం పట్టుకున్న కేసులు ఉన్నాయి. తంగళ్లపల్లి, సిరిసిల్లలో లారీలు, వ్యాన్లలో బియ్యాన్ని స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు.

పోషకాల బియ్యం సరఫరా

జిల్లాలో ఈ నెల నుంచి లబ్ధిదారులకు పోషకాల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. పేద ప్రజల్లో  పోషక లోపాలను అరికట్టేందుకు  ఈ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. క్వింటాల్ సాధారణ బియ్యంలో ఒక కిలో పోషకాలను కలుపుతారు. ఐరన్ విటమిన్ బీ 12, బీ1, బీ6, జింక్,  పోలిక్ యాసిడ్ తో పాటు గోధమలు, మినుములు, పెసర, ఆవాలు, రాగులు, సజ్జలతో కూడిన పొడిని ఇందులో ఉపయోగించనున్నారు.  ప్రభుత్వం ఇలాంటి ప్రయోగాత్మకంగా రేషన్ బియ్యంలో తీసుకు వస్తున్నా లబ్ధిదారులు మాత్రం వీటిని దళారులకు అమ్ముతున్నారు.