ఎఫ్ఐఆర్​లనే మార్చేశారు!.. నల్గొండ జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా ఆగడాలు

  • కలకలం రేపుతున్న హాలియ, పెద్దవూర బియ్యం కేసులు
  • ఒకే కేసుపై రెండు ఎఫ్ఐఆర్​లు రిజిస్టర్
  • మొదటి ఎఫ్​ఐఆర్​లో ఏ1గా ఉన్న కాంట్రాక్టర్ పేరు రెండో ఎఫ్​ఐఆర్​లో మాయం
  • స్టేజ్ 1 కాంట్రాక్టర్లు, బడా మిల్లర్లు, పోలీసులు, అధికారుల తతంగం

నల్గొండ, వెలుగు: రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసు నుంచి ఓ స్టేజ్ 2 కాంట్రాక్టర్​ను బయటపడేసేందుకు ఏకంగా ఎఫ్ఐఆర్​నే మార్చడం నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టిస్తున్నది. బడా మిల్లర్లు, ట్రాన్స్​పోర్ట్  కాంట్రాక్టర్లు కలిసి పోలీసులు, సివిల్ సప్లై అధికారుల సాయంతో రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా ఏ స్థాయిలో జరుగుతున్నదో ఈ ఉదంతంతో బయటపడింది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర, హాలియా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ నెల 15న పోలీసులు రెండు లారీల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకొని.. తొమ్మిది మందిపై కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్​లో ఏ1గా రేషన్ బియ్యం రవాణా కాంట్రాక్టర్​ కందుల వెంకటరమణ అనే వ్యక్తి పేరును చేర్చారు.

అయితే నాలుగైదు రోజుల్లోనే ఇదే కేసుకు సంబంధించి నమోదు చేసిన రెండో ఎఫ్ఐఆర్​లో ఏ1గా ఉన్న వెంకట రమణ పేరును తొలగించి పెద్దవూరలోని అమ్మ రైస్ మిల్లు ఓనర్ మలిగిరెడ్డి రామానుజరెడ్డి పేరు చేర్చారు. ఈ రామానుజరెడ్డి మొదటి ఎఫ్ఐఆర్​లో ఏ2గా ఉండడం గమనార్హం. ఇలా పోలీసులు ఎఫ్ఐఆర్​లను మార్చడం వెనుక చాలా తతంగం నడిచినట్లు తెలుస్తున్నది.

దందా వెనక నల్గొండకు చెందిన ఓ బాడా మిల్లర్​!

ఈ నెల 15న పీడీఎస్ బియ్యం లారీలను పట్టుకున్న పోలీసులు ఎంక్వైరీ పేరుతో హైడ్రామా నడిపించారు. మూడు రోజుల తర్వాత ఈ నెల 18న తొమ్మిది మందిని అరెస్టు చేసి కేసు పెట్టినట్టు పోలీసులు వివరాలను లీక్ చేశారు. 20వ తేదీన జిల్లా ఎస్పీ కేసు వివరాలు మీడియాకు వెల్లడిస్తూ ఎనిమిది మందిని మాత్రమే అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఆ ఎనిమిది మందిలో వెంకటరమణ లేకపోడం గమనార్హం. నిజానికి స్టేజ్1 కాంట్రాక్టర్ పైన కేసు నమోదు చేస్తే పీడీఎస్ బియ్యం దందా వెనుక ఉన్న రాకెట్ మొత్తం బయటపడేది. 

కానీ పోలీసులు స్టేజ్​ 2 కాంట్రాక్టర్​పేరు నమోదు చేసి.. కొద్ది రోజుల్లో అది కూడా తొలగించారు. నల్గొండ జిల్లా కేంద్రంగా నడుస్తున్న రేషన్​ బియ్యం రీసైక్లింగ్ వెనక నల్గొండలోని పేరుమోసిన రైస్ మిల్లర్, చిట్ ఫండ్, ఫైనాన్స్ నడుపుతున్న ఓ వ్యాపారి హస్తం ఉన్నట్టు తెలిసింది. ఈ కేసులో అసలు కాంట్రాక్టర్ ను తప్పించడంలో ఆయనే తెరవెనక తతంగం నడిపినట్లు సమాచారం. ఆయనకు అమ్మ రైస్ మిల్లులో కూడా భాగస్వామ్యం ఉందని, సీఎమ్మార్ బియ్యం పర్మిట్లు పొందిన కొద్దిరోజులకే అదే రైస్ మిల్లుకు పీడీఎస్ బియ్యం తరలించడం మిల్లర్ల రీసైక్లింగ్ దందాను స్పష్టం చేస్తున్నది.

ఎవరీ వెంకట రమణ?

కందుల వెంకట రమణను తప్పించేందుకు పోలీసులు ఎందుకు అంత రిస్క్ చేశారనేది ఆసక్తికరంగా మారింది. ఎఫ్​సీఐ గోదాం నుంచి రేషన్ బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్లకు చేర్చాల్సిన బాధ్యత స్టేజ్ 1 కాంట్రాక్టర్లదే. మధ్యలో ఎలాంటి పొరపాట్లు జరిగినా కాంట్రాక్టర్లు, అధికారులే రెస్పాన్స్. కానీ ఈ కేసులో స్టేజ్1 కాంట్రాక్టర్ ను కాకుండా ఆయన బంధువు స్టేజ్ 2 కాంట్రాక్టర్​గా వ్యవహరిస్తున్న వెంకటరమణ పేరును చేర్చారు. జిల్లాలో పీడీఎస్ రాకెట్ నడిపిస్తున్న ప్రధానమైన వ్యక్తుల్లో వెంకట రమణ ఒకరని, అందుకే అతని పేరు చేర్చామని మొదట్లో పోలీసులు చెప్పారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆయన్ను కూడా కేసు నుంచి తప్పించేందుకు రెండో ఎఫ్ఐఆర్ డ్రామా ఆడినట్లు తెలుస్తున్నది.

పనిచేయని జీపీఎస్​ ట్రాకింగ్, కెమెరాలు

పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు లారీలకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్, ఎంఎల్ఎస్ పాయింట్ గోదాంలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిన్నింటినీ జిల్లా కేంద్రంలోని డీఎస్​వో తన ఆఫీసులోని కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా పర్యవేక్షిస్తారు. కానీ పెద్దవూర ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద సీసీ కెమెరాలు ఎప్పటి నుంచో పనిచేయడం లేదు. 

జిల్లాలో ఎనిమిది ఎంఎల్ఎస్ పాయింట్లు ఉండగా మొత్తం 87 సీసీ కెమెరాలకు గాను 23 మాత్రమే పనిచేస్తున్నాయి. 64 కెమెరాలు పని చేయట్లేదు. జిల్లా కేంద్రమైన నల్గొండ పాయింట్లోనూ కెమెరాలు వర్క్ చేయడం లేదు. కాంట్రాక్టర్లు, గోదాంలో పనిచేసే ఉద్యోగులు అక్రమాలకు పాల్పడేందుకు ఇదొక మంచి అవకాశంగా మారింది.