నల్గొండ రేషన్‌‌ దందాలో... బడా నేతలు !

నల్గొండ రేషన్‌‌ దందాలో... బడా నేతలు !
  • గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా పీడీఎస్‌‌ బియ్యం అక్రమ రవాణా
  • లీడర్ల అండతో చక్రం తిప్పిన నలుగురు వ్యక్తులు
  • పోలీసుల పోస్టింగ్‌‌ నుంచి పైరవీల వరకు అంతా వారి కనుసన్నల్లోనే...
  • ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • పోలీసులు, లీడర్ల పాత్రపై ఆరా

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన రేషన్‌ బియ్యం దందా వ్యవహారంలో పెద్ద తలకాయలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లీడర్ల అండదండలతో జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు పదేండ్ల పాటు చక్రం తిప్పి కోట్ల రూపాయల విలువైన పీడీఎస్‌ బియ్యాన్ని పక్క రాష్ట్రానికి తరలించినట్లు సమాచారం. ఈ నలుగురు బియ్యం దందాలోనే కాకుండా, పోలీస్‌ పోస్టింగ్‌లలో సైతం జోక్యం చేసుకొని తమకు కావాల్సిన వారికి, కావాల్సిన చోట పోస్టింగ్‌ ఇప్పించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రేషన్‌ దందాను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పోలీసులు ఉమ్మడి నల్గొండ జిల్లాపై ఫోకస్‌ చేశారు. ఈ క్రమంలో పీడీఎస్‌ దందాలో కీలకంగా ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు.

సిండికేట్‌‌గా ఏర్పడి...

సూర్యాపేటకు చెందిన శంకర్‌‌ అనే వ్యక్తి మొదట్లో బియ్యం వ్యాపారం చేసేవాడు. చిన్నగా మొదలైన అతడి వ్యాపారం పదేండ్లలోనే ఉమ్మడి జిల్లాను శాసించే స్థాయికి చేరింది. బీఆర్ఎస్‌‌ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో పీడీఎస్‌‌ బియ్యం వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. జిల్లాల ఆవిర్భావం అనంతరం బీఆర్‌‌ఎస్‌‌ లీడర్ల అండతో మరింత రెచ్చిపోయాడు. రమేశ్‌‌, భిక్షపతి, శివకుమార్‌‌ అనే మరో ముగ్గురితో కలిసి సిండికేట్‌‌గా ఏర్పడి డీలర్ల నుంచి రేషన్‌‌ బియ్యం సేకరించేవాడు. 

Also Read :- ఉప్పల్‎లో వింత దొంగ.. చెప్పులు, షూ కొట్టేసి ఎర్రగడ్డలో అమ్మకం

ఆ బియ్యాన్ని సరిహద్దు మండలాల నుంచి ఏపీలోని కాకినాడ పోర్ట్‌‌కు తరలిస్తూ కోట్లలో సంపాదించాడు. అప్పటి అధికార పార్టీ నాయకుల సపోర్ట్‌‌ కూడా ఉండడంతో పోలీసులు సైతం చూసీచూడనట్లుగా వ్యవహరించారన్న ఆరోపణలు వినిస్తున్నాయి. జిల్లాలో ఎవరైనా సరే ‘ఈ నలుగురి’కే పీడీఎస్‌‌ బియ్యం అమ్మాలని హుకుం జారీ చేశారు. అంతేకాకుండా నాయకులకు సంబంధించిన అన్ని సెటిల్‌‌మెంట్లలో ఈ నలుగురే కీలకంగా వ్యవహరించి చక్కదిద్దేవారు. మరో వైపు పోలీస్‌‌ పోస్టింగ్‌‌ల కోసం పైరవీలు చేసి కావాల్సిన ఏరియాలకు పోస్టింగ్ వచ్చేలా చూశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంత చేసినా గత బీఆర్‌‌ఎస్‌‌ హయాంలో వీరిపై ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.

పోలీసులు అదుపులో ‘ఆ నలుగురు’

కాంగ్రెస్‌‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పీడీఎస్‌‌ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేషన్‌‌ బియ్యం అక్రమ రవాణాపై ఫోకస్ పెట్టిన పోలీసులు, ఈ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇటీవల కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేపట్టిన పోలీసులకు ‘ఆ నలుగురి’కి సంబంధించిన విషయాలు తెలిశాయి. దీంతో శంకర్‌‌తో పాటు రమేశ్‌‌, భిక్షపతి, శివకుమార్‌‌ను బుధవారం అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేపట్టారు. నాయకులు, పోలీసులతో ఉన్న లింకేటి ? రేషన్‌‌ బియ్యాన్ని కాకినాడ పోర్ట్‌‌కు ఎలా తరలించారు ? అనే అంశాలపై విచారణ చేస్తున్నారు. 

పోలీసుల పాత్రపైనా ఎంక్వైరీ

గత ప్రభుత్వ హయాంలో జరిగిన పీడీఎస్‌‌ బియ్యం దందాలో పోలీసుల పాత్రపైనా విచారణ చేస్తున్నారు. దందాలో పాల్గొన్న వారికి పోలీసుల నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందాయి ? అనే అంశంపై సీసీఎస్ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. నల్గొండ ఎస్పీ ఆధ్వర్యంలో సీసీఎస్ పోలీసులతో ఓ టీమ్‌‌ను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని మల్టీ జోన్‌‌ 2 ఐజీ సత్యనారాయణ ఆదేశించారు. ఇప్పటికే కొందరి పేర్లను ప్రస్తావించగా వారికి సంబంధించిన కాల్‌‌డేటాను సేకరిస్తున్నట్లు సమాచారం. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన పోలీసుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.