జార్ఖండ్‌లో ఓ వింత కేసు వెలుగు చూసింది. ధన్‌బాద్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో పట్టుబడిన 10 కిలోల గంజాయి, తొమ్మిది కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయి. ఆరేళ్ల క్రితం స్వాధీనం చేసుకున్న గంజాయిని ఎలుకలు తినేశాయని స్వయంగా పోలీసులు కోర్టుకు తెలపడం గమనార్హం. 2018 డిసెంబర్ 14న పది కిలోల గంజాయి, తొమ్మిది కిలోల ఎండు గంజాయిని శంభుప్రసాద్ అగర్వాల్, అతడి కొడుకు నుంచి రాజ్‌గంజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్టు చేసి ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు.
అయితే తాజాగా ఈ కేసు మరోసారి విచారణకు రాగా స్వాధీనం చేసుకున్న గంజాయి నిల్వలన్నీ చూపించాలంటూ రాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారిని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో పోలీసులు వింతైన రిపోర్టును రెడీ చేశారు. పోలీసు స్టేషన్‌లోని గోదాంలో నిల్వ చేసిన డ్రగ్స్‌ను ఎలుకలు పూర్తిగా ధ్వంసం చేశాయని రిపోర్టును కోర్టుకు సమర్పించారు. దీనికి సంబంధించి పోలీసు స్టేషన్‌లో రిపోర్టు కూడా నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు.
2018 డిసెంబర్ 14న, రాజ్‌గంజ్ పోలీసులు 10 కిలోల భాంగ్, తొమ్మిది కిలోల గంజాయితో దొరకడంతో శంభుప్రసాద్ అగర్వాల్, అతని కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. అయితే స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను చూపించే స్థితిలో పోలీసులు లేనందున.. తమపై నమోదు చేసిన స్మగ్లింగ్ అభియోగాలను కొట్టివేయాలని వారు ఏప్రిల్ 06న న్యాయస్థానాన్ని కోరారు. ఈమేరకు వారి న్యాయవాది అభయ్ భట్ కోర్టులో వాదనలు వినిపించారు. తన క్లయింట్స్‌ను పోలీసులు అక్రమంగా డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఇరికించారని లాయర్ ఆరోపించారు.