రిమ్స్ వార్డుల్లో ఎలుకలు.. రోడ్ల మీద పేషంట్లు..

కరోనా ఐసోలేషన్, పిల్లల వార్డుల్లో చక్కర్లు

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలా బాద్ రిమ్స్ హాస్పిటల్లో ఎలుకలు కంగారు పెట్టిస్తున్నాయి. చిన్న పిల్లల వార్డు, కరోనా ఐసోలేషన్ వార్డుల్లో తిరుగుతూ పేషెంట్లను ఇబ్బంది పెడుతున్నాయి. రాత్రిపూట పిల్లలను ఎలుకలు కొరుకుతున్నాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కరోనా పేషెంట్లకు ఇస్తున్న మందులు, ఫుడ్డును పాడు చేస్తున్నట్టు రోగులు చెబుతున్నారు. దీంతో చాలా మంది కరోనా పేషెంట్లు ఆస్పత్రిలో ఉండలేక ఇళ్లకు వెళ్లిపోతున్నారు. వారం రోజుల కిందట పది మంది కరోనా పేషెంట్లు ఇంటికి వెళ్లిపోయారు. బుధవారం కూడా ఓ పేషెంట్ రోడ్డు మీదకు వచ్చేశాడు. ఇంటికి పంపించేయాలని మొండి పట్టుపట్టాడు. దీంతో ఆస్పత్రి అధికారులు అతడిని అంబులెన్సులో ఇంటి దగ్గర దిగబెట్టారు. ఆస్పత్రిలో శానిటైజేషన్ కూడా సరిగ్గా చేయట్లేదని పేషెంట్లు ఆరోపిస్తున్నారు.

అన్నీ సమస్యలే
రిమ్స్ ఆస్పత్రిలోని అన్ని వార్డుల్లోనూ సమస్యలున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా 60 శాతం మంది డాకర్ల కొరత ఉంది. ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా గాడి తప్పిందన్న విమర్శలున్నాయి. ఆస్పత్రి డైరెక్టర్ బలరాం నాయక్, డాకర్ల మధ్య సరైన అవగాహన లేకపోవడం, విభేదాలు పెరిగిపోవడంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఇటీవల డైరెక్టర్ తీరును వ్యతిరేకిస్తూ డాక్టర్లు వారంరోజులపాటు ఆందోళనలూ చేశారు. రిమ్స్ లో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న కొంతమంది సీనియర్ డాక్టర్ల కారణంగానే ఈ పరిస్థితులున్నాయని డైరెక్టర్ బలరాం నాయక్ అన్నారు. డ్యూటీ సరిగ్గా చేయాలన్న ఆదేశాలను పట్టించుకోవడం లేదంటున్నారు. అందువల్లే స్టాఫ్ ను ఏకం చేసి ఆందోళనలకు దిగారని ఆరోపిస్తున్నారు.వాళ్లకు స్థానిక అధికార పార్టీ పెద్దలు కూడా అండగా నిలబడడంతో డైరెక్టర్ ఏమీ చేయలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఆసుపత్రి సేవలను మెరుగుపరచాలంటే డాక్టర్లు, స్టాఫ్ ను కొన్ని సందర్భాల్లో మందలించాల్సి ఉంటుందని , అయితే స్టాఫ్ నుంచి వ్యతిరేకత వస్తుండడం,రాజకీయజోక్యం పెరిగిపోవడంతో డైరెక్టర్ నిమిత్త మాత్రుడిగా మారిపోయారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఆస్పత్రిలో రోగులకు సరైన సేవలు అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చర్యలు తీసుకుంటం
ఎలుకలు వార్డుల్లో తిరుగుతున్నట్టు సంబంధిత డాక్టర్లు నాకు చెబితే చర్యలు తీసుకునేవాడిని. ఏమీ చెప్పకుండా బయటకు వీడియోలు రిలీజ్ చేయించడం సరికాదు. వార్డుల్లో ఎలుకలు తిరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటాం.
– బలరాం నాయక్, రిమ్స్ డైరెక్టర్