రావణాసురుడు.. అత్యంత శక్తిమంతుడు.. ఆయనకు ఉన్న తపశ్శక్తి అంతా ఇంతా కాదు.. ఏక కాలంలో నూరు శివలింగాలకు అర్చన చేసే అంత శక్తి ఉంది. అయినా ఏం లాభం ఒక మానవుడి చేతిలో మరణించాడు. అయితే సీతను అపహరించడం వలన రాముడు చంపాడని అందరూ అనుకుంటారు. కాని రావణాసురుడి మరణానికి కారణం.. ఆయన ఇంద్రియాలే పగబట్టాయని .. రావణాసురుడు మరణించే సమయంలో ఆయన భార్య మండోదరి చెప్పిందని పురాణాలు చెబుతున్నాయి... ఇంకా రావణుడితో ఏమని మాట్లాడిందో తెలుసుకుందాం... .
త్రేతా యుగంలో రావణాసురుడిని .. శ్రీరామ చంద్రుడు యుద్దంలో చంపాడని రామాయణం చెబుతోంది. అయితే లంకాధిపతి రావణుడు చనిపోయేటప్పుడు.. అవసాన దశలో ఉండగా.. ఆయన భార్య మండోదరి మేలి ముసుగు తీసి వచ్చి .. రావణుడితో కొన్ని సత్యాలు మాట్లాడిందని పురాణాలు చెబుతున్నాయి.
రావణాసుడు చనిపోయే సమయంలో అక్కడికి మేలి ముసుగు తీసేసి పరిగెత్తుకుంటూ రావణుడి పట్టమహిషి అయిన మండోదరి వచ్చి, రావణుడిని కౌగలించుకొని "ఇవ్వాళ నేను మేలి ముసుగు లేకుండా పరిగెత్తుకొచ్చానని కోపం తెచ్చుకోకు, నువ్వు దేవతలందరినీ ఓడించావు, ఎందరినో తరిమికొట్టావు, దుర్భేద్యమైన కాంచన లంకని నిర్మించావు. 10 తలలతో 20 చేతులతో ప్రకాశించావు... గొప్ప తపస్సు చేసి చివరికి ఒక మనుష్యుడి చేతిలో మరణించావు. గతంలో హనుమంతుడు ఈ సముద్రాన్ని దాటి నీ పది తలకాయలు ఇప్పుడే గిల్లేస్తాను... కాని రాముడు నిన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు కనుక వదిలేస్తున్నాను అని, లంకని కాల్చి వెళ్ళిపోయాడు. ఒక్కడే అలా వచ్చి లంకని నాశనం చేసి వెళ్ళిపోయినా నీ మనస్సులో శంక కలగలేదు. నీ జీవితానికి ప్రమాదం వస్తుందని నువ్వు ఆలోచించలేదు. కోతులంటే చపల బుద్ధికి పెట్టింది పేరు, అలాంటి కొన్ని కోట్ల కోతుల్ని రాముడు వెంట పెట్టుకుని సముద్రానికి సేతువు కట్టించి దాటి వచ్చాడు.. అప్పుడైనా నీకు అనుమానం రాలేదా. ... ఒక మనుష్యుడైన రాముడి చేతిలో చనిపోయావా అని పక్కకి తిరిగి రాముడిని చూసింది.
రాముడిని చూడగానే ఈయన మనుష్యుడు కాదు, సనాతనమైన పరమాత్మ. నిన్ను నిగ్రహించడానికి వచ్చిన శ్రీ మహావిష్ణువు, దేవతలందరినీ వానర రూపాలు ధరింపచేసి, వాళ్ళని వెంట బెట్టుకుని, శంఖ చక్ర గదా పద్మములను పట్టుకున్న శ్రీ మహావిష్ణువు వచ్చాడు. రాముడిని ఎన్ని సార్లు చూసినా ...వచ్చింది విష్ణువు అని నీకు ఎందుకు అర్ధం కాలేదు... రావణా! నువ్వు రాముడి చేత సంహరింపబడ్డావని లోకము అనుకుంటుంది. కాని అందుకు కాదు.. నువ్వు ఎందువలన చనిపోయావో నాకు తెలుసు. ..
నిన్ను సీతాదేవిని అపహరించవద్దని నీ ఇంద్రియాలన్ని చెబుతున్నా.. లెక్క చేయలేదు. నీకున్న తపశ్శక్తితో నీ ఇంద్రియాలని బలవంతంగా తొక్కిపెట్టావు. అప్పుడు నీ ఇంద్రియాలు నీ మీద పగబట్టాయి. నీవు ఓ స్త్రీ కారణంగా... మానవ రూపంలో ఉన్న విష్ణుమూర్తి చేతిలో నీవు మరణిస్తావు.. అని నీ ఇంద్రియాలే నీకు శాపం పెట్టాయి. అందుకని నిన్ను చంపింది రాముడు కాదు, నీ ఇంద్రియాలే నిన్ను చంపాయి.
ఒక్కసారి కామం పుట్టింది అనడానికి నీ విషయంలో ఆస్కారం లేదు. మహా సౌందర్యరాసులైన భార్యలు నీకు కొన్ని వేల మంది ఉన్నారు. వారితో నువ్వు ఎవరితో క్రీడించినా నీ కామము అదుపులో ఉంటుంది.కాని నీ ఇంద్రియాలు ఇచ్చిన శాపం వలన ఎక్కడో అరణ్యంలో ఉన్న సీతమ్మ మీద కామం పుట్టి ఆవిడని నువ్వు అనుభవించాలనే కోరిక పుట్టింది. నువ్వు, నీ రాజ్యము, నీ వారు భ్రష్టు పట్టడం కోసం నీకు ఆ కోరిక పుట్టింది. నీతో పాటు మేము కూడా ఇబ్బందులు పడుతున్నాము.
అయ్యో! నీకు సీతమ్మ ఎవరో అర్ధం కాలేదు, ఆవిడ రోహిణి కన్నా, అరుంధతి కన్నా గొప్పది. తన భర్తని అనుసరించి వచ్చిన ఇల్లాలిని ఒంటరిగా ఉన్నప్పుడు ఎత్తుకొచ్చావు. ఆ తల్లి తేజస్సు నిన్ను కాల్చింది. నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఆ తల్లిని తేవడం వలన సువ్వు పొందే సుఖం ఏమి లేదు... నాశనం అయిపోతావని చెప్పాను. నువ్వు చేసుకున్న పూర్వ పుణ్యముల వలన కాంచన లంకని అనుభవించావు. ఎన్నో సుఖాలు పొందావు. కాని సీతమ్మని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టడం వలన ఆ పాపాన్ని అనుభవించాల్సి వచ్చింది.... పడిపోయావు. విభీషణుడు పుణ్యాలు చేశాడు, సీతమ్మ ఎవరో తెలుసుకున్నాడు, ఆ పుణ్య ఫలం విభీషణుడికి అనుభవంలోకి వచ్చింది, బతికిపోయాడు.
రావణా! సీత నాకన్నా గొప్ప కులంలో పుట్టిందా.. నాకన్నా గొప్ప రూపవతా, నాకన్నా గొప్ప దాక్షిణ్యం ఉన్నదా, సీత నాకన్నా ఎందులో గొప్పది? కాని నీ దురదృష్టం, నాకన్నా సీత నీకు గొప్పదిలా కనపడింది. నా తండ్రి దానవ రాజైన మయుడు, నా భర్త లోకములను గెలిచిన రావణుడు, నా కుమారుడు ఇంద్రుడిని జయించిన మేఘనాధుడు, నేనున్నది కాంచన లంకలో అని అహంకరించాను, కాని ఇది నిలబడలేదు, అబద్ధమయిపోయింది. నాకు ఇప్పుడు కొడుకు లేడు, భర్త లేడు, రాజ్యం లేదు, బంధువులు లేరు, నీకు తలకొరివి పెట్టడానికి ఒక్క కొడుకూ లేడు. నువ్వు మహాపాతకం చెయ్యడం వలన 10 రోజులలో నా పరిస్థితి ఇలా అయిపోయింది. మహా పతివ్రత అయిన స్త్రీ ఏ ఇంటికన్నా వచ్చి కన్నీరు పెడితే, ఆ కన్నీరు కిందపడితే, ఆ ఇల్లు నాశనమయిపోతుంది" అని బాధపడింది.