హైదరాబాద్ లో ఐటీ సెక్టార్ అభివృద్ధితో పాటు వెస్ట్రన్ కల్చర్ కూడా వేగంగా వ్యాపిస్తోంది. పబ్బుల్లో తరచూ విపరీతంగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయి.ఆడ మగా అన్న తేడా లేకుండా మెజారిటీ యువత డ్రగ్స్ కి బానిసలవుతున్నారు. తాజాగా గచ్చిబౌలిలో రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ పార్టీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. రేవ్ పార్టీని భగ్నం చేసిన మాదాపూర్ పోలీసులు 8మంది అమ్మాయిలు, 18మంది అబ్బాయిలను అరెస్ట్ చేశారు.
నిందితులను అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. వారి నుండి గంజాయి ప్యాకెట్స్, ఈ సిగరెట్స్ తో పాటు భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పార్టీలో బడాబాబులు, ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులకు కూడా లింక్ ఉన్నట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.