భారత మాజీ క్రికెటర్, కోచ్, వ్యాఖ్యాత రవిశాస్త్రి వివాదంలో చిక్కుకున్నారు. బ్రతికున్న క్రికెటర్‌ను చనిపోయాడని వ్యాఖ్యానించడమే అందుకు ప్రధాన కారణం. ముంబై వాంఖడే వేదికగా జరుగుతోన్న భారత్ - న్యూజిలాండ్ ఆఖరి టెస్టుకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న రవిశాస్త్రి పొరపాటున భారత మాజీ ఆటగాడు నారీ కాంట్రాక్టర్ మరణాన్ని ఉచ్చరించాడు. పోనీ, అంతటితో ఊరుకున్నాడా..! లేదు. ఆయన మరణం పట్ల సోషల్ మీడియాలో నివాళులు అర్పించాడు. తీరా చూస్తే, నారీ కాంట్రాక్టర్ బ్రతికే ఉన్నారు.
క్షమించండి.. ఆయన బ్రతికే ఉన్నారు
చివరకు పొరపాటు గ్రహించిన రవిశాస్త్రి తన పోస్ట్‌ను తొలగించడమే కాకుండా.. నారీ కాంట్రాక్టర్ కుటుంబసభ్యులకు, ఆయన అభిమానులకు బహిరంగ క్షమాపణలు చెప్పారు.
"క్షమాపణలు.. నారీ కాంట్రాక్టర్ మృతిపై వస్తున్న వార్తలు అవాస్తవం. ఆయన ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారు.." అని రవి శాస్త్రి మరో పోస్ట్ చేశారు.
Apologies - the news floating around the demise of Nari Contractor is incorrect. He is fine. God bless 🙏 pic.twitter.com/zGqWjim9SL
— Ravi Shastri (@RaviShastriOfc) November 2, 2024
ఎవరీ నారీ కాంట్రాక్టర్.. ?
లెఫ్ట్ హ్యాండ్ బ్యాటరైన నారీ కాంట్రాక్టర్.. 1955లో ముంబై బ్రబౌర్న్ స్టేడియంవేదికగా న్యూజిలాండ్‌పై తన టెస్ట్ కెరీర్ ప్రారంభించారు. ఏడేళ్ల తన అంతర్జాతీయ కెరీర్‌లో 31 టెస్టుల్లో 1,611 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన కంటే, 1962లో వెస్టిండీస్ పర్యటనలో ఆయనకు తగిలిన గాయం బాగా చర్చనీయాంశం. అదొక విషాదకర ఘటన.
బార్బడోస్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో విండీస్ పేసర్ చార్లీ గ్రిఫిత్ వేసిన బౌన్సర్ తగిలి నారీ కాంట్రాక్టర్ ఆరు రోజుల పాటు అపస్మారక స్థితిలో ఉండిపోయారు. ఆ సమయంలో ఆయనను రక్షించుకునేందుకు వెస్టిండీస్ కెప్టెన్ ఫ్రాంక్ వోరెల్ సహా పలువురు సహచరులు రక్తదానం చేశారు. అనేక శస్త్రచికిత్సల అనంతరం ఆయన కోలుకున్నప్పటికీ, తిరిగి ప్రొఫెషనల్ క్రికెట్‌కు తిరిగి రాలేకపోయారు. నారీ కాంట్రాక్టర్ కథ భారతీయ క్రికెట్ చరిత్రలో ధైర్యసాహసాలకు, స్నేహానికి చిరస్థాయిగా నిలిచిపోయింది.