Cricket World Cup 2023: ఇప్పుడే గెలవండి.. లేకపోతే 12 ఏళ్ళు మీ వల్ల కాదు: రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

Cricket World Cup 2023: ఇప్పుడే గెలవండి.. లేకపోతే 12 ఏళ్ళు మీ వల్ల కాదు: రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

వరల్డ్ కప్ లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తుంది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ లో గెలిచిన భారత్..ఈ టోర్నీలో తమ జైత్రయాత్రను కొనసాగిస్తుంది. ఒకసారి టీమిండియా సాధించిన విజయాలను పరిశీలిస్తే అన్ని భారీ విజయాలే కావడం విశేషం. ప్రతి మ్యాచ్ లో కూడా ప్రత్యర్థులను చిత్తు చేస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఈ సారి సొంతగడ్డపై టైటిల్ గెలవగలదని అందరూ భావిస్తున్నారు. ఇదే విషయం గురించి టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసాడు.

రవి శాస్త్రి మాట్లాడుతూ "టీమిండియా ఈ సారి పటిష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న జట్టును చూస్తుంటే వరల్డ్ కప్ గెలవడం పెద్ద కష్టం కాదు. 12 ఏళ్ళ క్రితం ధోనీ కెప్టెన్సీలో సొంత మైదానంలో వరల్డ్ కప్ గెలిచాం. మరో సారి విశ్వ విజేతగా నిలవడానికి భారత్ కు ఇదొక సువర్ణావకాశం. ఒకవేళ ఈ సారి వరల్డ్ కప్ మిస్ అయితే మరో 12 ఏళ్ళు నిరీక్షణ తప్పదు. ఇప్పుడున్న జట్టులో 7,8 మంది ఆటగాళ్లు సూపర్ ఫామ్ లో ఉన్నారు. వీరిలో చాలామందికి ఇదే చివరి వరల్డ్ కప్. దీంతో ఈ సారి భారత్ జట్టు వరల్డ్ కప్ కొట్టాలని గట్టిగ భావిస్తుంది. అని రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు. 

ఈ సందర్భంగా భారత పేసర్ల గురించి శాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. భారత బౌలింగ్ మునుపెన్నడూ లేనంత బలంగా తయారైంది. బుమ్రా, సిరాజ్ జట్టు కోసం చాలా సంవత్సరాలు సేవలు అందిస్తుంటే సిరాజ్ వారితో చేరి చక్కగా సహకరిస్తున్నాడు. భారత పిచ్ లపై ఎక్కడ బౌలింగ్ చేస్తే వికెట్లు పడతాయి అనే విషయంపై వీరికి మంచి అవగాహన ఉంది. 90 శాతం స్టంప్స్ ను లక్ష్యంగా చేసుకొని బౌలింగ్ వేశారు. 50 ఏళ్ళ పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఇదే బెస్ట్ బౌలింగ్ లైనప్. అని భారత సీమర్లను కొనియాడాడు.    మరి రవి శాస్త్రి చెప్పినట్టుగా భారత్ 12 ఏళ్ళ తర్వాత వరల్డ్ కప్ ట్రోఫీని గెలుస్తుందో లేదో చూడాలి.