IND vs BAN 2024: రికార్డుల వర్షం: విండీస్, ఆసీస్ దిగ్గజాలను దాటేసిన అశ్విన్

IND vs BAN 2024: రికార్డుల వర్షం: విండీస్, ఆసీస్ దిగ్గజాలను దాటేసిన అశ్విన్

టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ వయసుతో సంబంధం లేకుండా తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. టెస్ట్ కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు టాప్ ఫామ్ తో దూసుకెళ్తున్నాడు. 38 ఏళ్ళ వయసులోనూ దిగ్గజాల రికార్డులను బద్దలు కొడుతున్నాడు. తాజాగా బంగ్లాదేశ్ పై ముగిసిన చెన్నై టెస్టులో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో బ్యాట్ తో మెరిసి సెంచరీ.. రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ లో చెలరేగి 6 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో అశ్విన్ బద్దలు కొట్టిన రికార్డ్స్ ఇప్పుడు చూద్దాం 

నాలుగో రోజు ఆటలో భాగంగా షకీబ్ ఉల్ హసన్ వికెట్ తీసి 5 వికెట్లు పడగొట్టిన అశ్విన్ టెస్టు క్రికెట్ లో 37 సార్లు ఈ ఫీట్ సాధించి   ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ను సమం చేశాడు. షేన్ వార్న్ 145 మ్యాచ్ ల్లో ఈ ఘనత అందుకుంటే.. అశ్విన్ మాత్రం 101 టెస్టులు  అవసరమయ్యాయి. ఓవరాల్ గా ఈ లిస్ట్ లో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అగ్ర స్థానంలో ఉన్నాడు. ఈ మాజీ లంక స్పిన్నర్ ఏకంగా 67 సార్లు 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. 

Also Read :- అశ్విన్‌కు ఆరు వికెట్లు

ఈ మ్యాచ్ లోనే షకీబ్ వికెట్ తీసి అశ్విన్ 520 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. దీంతో వెస్టిండీస్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ కోట్నీ వాల్ష్ 519 వికెట్లను దాటేశాడు. ఓవరాల్ గా టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల లిస్ట్ లో అశ్విన్ 8 వ స్థానంలో కొనసాగుతున్నాడు. 800 వికెట్లతో మురళీ ధరన్ టాప్ లో ఉన్నాడు. ఇక ఒకే మ్యాచ్ లో సెంచరీతో పాటు 5 వికెట్లు పడగొట్టి ఈ ఫీట్ నాలుగో సారి సాధించాడు. అశ్విన్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో నేడు (సెప్టెంబర్ 22) ముగిసిన చెన్నై టెస్టులో బంగ్లాదేశ్ పై భారత్ 280 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.