Ravi Ashwin: డిఫెన్స్ ఆడగలిగితే అతను ప్రతి మ్యాచ్‌లో సెంచరీ కొట్టగలడు: రవిచంద్రన్ అశ్విన్

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ బోర్డర్ గానస్కర్ ట్రోఫీలో విఫలమైన సంగతి తెలిసిందే. పంత్ నుంచి అడపాదడపా ఇన్నింగ్స్ లు మినహాయిస్తే ఒక్క మ్యాచ్ విన్నింగ్ నాక్ కూడా రాలేదు. 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 254 పరుగులు మాత్రమే చేయగలిగాడు . ఎన్నో అంచనాల మధ్య ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన పంత్ విఫలం కావడం టీమిండియా విజయావకాశాలపై ప్రభావం చూపించింది. ఈ సిరీస్ లో పంత్ షాట్ సెలక్షన్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ పంత్ సామర్ద్యాన్ని కొనియాడాడు.

అశ్విన్ మాట్లాడుతూ.. " రిషబ్ పంత్ కు అన్ని షాట్స్ ఆడగలిగే సామర్ధ్యం ఉంది. అతనికి రివర్స్ స్వీప్, స్లాగ్ స్వీప్ లాంటి షాట్స్ ఆడగలడు. సమస్య ఏమిటంటే ఈ షాట్‌లన్నీ హై-రిస్క్ షాట్‌లు. తన డిఫెన్స్‌తో అతను 200 బంతులు ఎదుర్కొంటే ప్రతి గేమ్‌లో తప్పకుండా పరుగులు సాధిస్తాడు. తన గేమ్ ను మెరుగు పర్చుకుంటే ప్రతి మ్యాచ్ లో 100 పరుగులు కొడతాడు. సిడ్నీ టెస్టులో రెండు రెండు వేర్వేరు నాక్‌లు ఆడాడు. తొలి ఇన్నింగ్స్ లో 40 పరుగులు చేసినా ఎవరు గుర్తించలేదు. రెండో ఇన్నింగ్స్ లో వేగంగా హాఫ్ చేసిన ఇన్నింగ్స్ కి ప్రశంసలు లభించాయి". అని ఈ దిగ్గజ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు. 

Also Read :- అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా ఫాస్ట్ బౌలర్ రిటైర్మెంట్

కారు ప్రమాదంలో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్.. తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. దాదాపు రెండేళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ఈ యువ వికెట్ కీపర్.. రీ ఎంట్రీలో తన తొలి టెస్ట్ మ్యాచ్ లో సెంచరీతో సత్తా చాటాడు. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో 124 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతూ బిజీగా ఉన్నాడు.

ఐపీఎల్ చరిత్రలో రిషబ్ పంత్ కు కనీ వినీ ఎరుగని ధర లభించింది. వేలానికి ముందు ఖచ్చితంగా భారీ ధర పలుకుతాడని ఆశించిన అతనిపై కోట్ల వర్షం కురిసింది. ఇటీవలే 2024 మెగా వేలంలో రూ. 27 కోట్ల రూపాయలకు రిషబ్ పంత్ ను లక్నో సూపర్ జయింట్స్ దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక ధర కావడం విశేషం.