![Champions Trophy 2025: ఐదుగురు స్పిన్నర్లు ఎందుకు.. భారత జట్టు సెలక్షన్‌పై అశ్విన్ విమర్శలు](https://static.v6velugu.com/uploads/2025/02/ravichandran-ashwin-questioned-indias-tactics-for-the-upcoming-champions-trophy_ZiPFyQORLX.jpg)
ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యుల జట్టులో భారత్ ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేసింది. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ , వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత స్పిన్నర్లు. ఈ మెగా టోర్నీలో భారత్ అన్ని మ్యాచ్ లు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడుతుంది. ఇక్కడ పిచ్ లు స్పిన్నర్లకు సరిగా అనూకూలించవు. అయినప్పటికీ భారత్ ఐదుగురు స్పిన్నర్లతో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడడం ఆశ్చర్యం కలిగించిందని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ అన్నాడు.
అశ్విన్ తన యూ ట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ.. "మనం దుబాయ్ కి ఎందుకు చాలా మంది స్పిన్నర్లను తీసుకెళ్తున్నామో నాకు అర్థం కావడం లేదు. ఐదుగురు స్పిన్నర్లను సెలక్ట్ చేసి యశస్వి జైస్వాల్ పై వేటు వేయడం అవసరమా..? ఒక టూర్ కి ముగ్గురు లేదా నలుగురు స్పిన్నర్లను తీసుకోవచ్చు. కానీ దుబాయ్ కి ఐదుగురు స్పిన్నర్లతో వెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మన జట్టులో ఒకటి లేదా ఇద్దరు స్పిన్నర్లు ఎక్కువగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఇటీవలే దుబాయ్ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ లీగ్ లో స్పిన్ తిరగలేదు. 180 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా జట్లు ఛేజ్ చేశాయి. జట్టు కూర్పు కొంచెం అసౌకర్యంగా ఉంది". అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
Also Read : టీమిండియా బ్యాటర్ హిట్టింగ్‌కు నెటిజన్ ఫిదా
భారత జట్టు పాల్గొనే మ్యాచ్‌లు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ గ్రూప్ ఏ లో ఉండగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ బి లో ఉన్నాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఫిబ్రవరి 23 న మ్యాచ్ జరుగుతుంది. ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు.. అంటే 19 రోజుల పాటు అభిమానులను అలరించనుంది. ఫిబ్రవరి 19న కరాచీ వేదికగా ఆతిథ్య పాకిస్థాన్ జట్టు.. ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఆతిధ్య దేశం పాకిస్థాన్ తో పాటు భారత్ ఈ టోర్నీలో టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతున్నాయి.
Ravichandran Ashwin questions the inclusion of five spinners in India's 15-member squad for the Champions Trophy.#CT25 #ChampionsTrophy #TeamIndia pic.twitter.com/MbIzGbkZP3
— Circle of Cricket (@circleofcricket) February 15, 2025