Ravichandran Ashwin: దిగ్గజానికి అరుదైన గౌరవం: రాష్ట్రపతి చేతుల మీదుగా అశ్విన్‌కు పద్మశ్రీ అవార్డు

Ravichandran Ashwin: దిగ్గజానికి అరుదైన గౌరవం: రాష్ట్రపతి చేతుల మీదుగా అశ్విన్‌కు పద్మశ్రీ అవార్డు

టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మశ్రీని అందుకున్నారు. సోమవారం (ఏప్రిల్ 28) రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఒక గొప్ప కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ భారత స్పిన్ దిగ్గజం ఈ అవార్డును అందుకోవడం జరిగింది. క్రీడల్లో దేశానికి చేసిన కృషికి గాను అశ్విన్ కు ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అశ్విన్ ఈ ప్రతిష్టాత్మక అవార్డు గ్రహీతలలో ఒకరిగా ప్రకటించబడ్డాడు. 

సోమవారం రాష్ట్రపతి ముర్ము నుండి పద్మశ్రీని స్వీకరించే కార్యక్రమానికి హాజరయ్యాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దాదాపు 15 సంవత్సరాల తన కెరీర్ లో టీమిండియా తరపున 287 మ్యాచ్ లాడాడు. గత ఏడాది డిసెంబర్ 2024లో అంతర్జాతీయ క్రికెట్ కు అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్లలో ఇండియా  తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్‌గా అశ్విన్ తన క్రికెట్ కెరీర్ ను ముగించాడు. 

అశ్విన్ ఇప్పటివరకు భారత్ తరపున 106 టెస్టుల్లో 200 ఇన్నింగ్స్ ల్లో బౌలింగ్ చేశాడు. 537 వికెట్లు తీసి భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. బ్యాటింగ్ లోనూ మెరిసి 3503 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. 116 వన్డేల్లో 156 వికెట్లు.. 65 టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినా ఐపీఎల్  ఆడుతూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు.