ధోనీ కాదు.. ఇండియన్ క్రికెట్ లో అతడే గ్రేట్ ఫినిషర్: విరాట్ కోహ్లీ

 ప్రపంచంలో ఎంతమంది బ్యాటర్లున్నా.. గ్రేట్ ఫినిషర్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోని. కేవలం దేశంలో ఉన్న ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ లో చాలా మంది ధోనీ బెస్ట్ ఫినిషర్ అని తెలియజేసారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కూల్ గా ఆడుతూ సరైన ఫినిషింగ్ ఇవ్వడంలో మాహీకి తిరుగులేని రికార్డ్ ఉంది. అయితే కోహ్లీ మాత్రం ఈ విషయంలో భిన్నంగా స్పందించాడు. ధోనీని మించిన బ్యాటర్ మరొకరు ఇన్నింగ్స్ కి సరైన ముగింపు ఇస్తాడని చెప్పుకొచ్చాడు. 

 స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్​​తో ఒకసారి ఆసక్తికర సంభాషణలో భాగంగా ఈ విషయాన్ని చెప్పాడట విరాట్. ఇందులో భాగంగా  డెత్ ఓవర్లలో కెప్టెన్లకు పీడకల లాంటి బ్యాటర్ ఎవరో తెలుసా? అని అశ్విన్​ను అడిగాడట కోహ్లీ. దీనికి వెంటనే ధోనీ అని సమాధానం  చెప్పాడు అశ్విన్. అయితే ఇదే ప్రశ్న కోహ్లీని అశ్విన్ అడిగితే కోహ్లీ ధోనీ కాదు రోహిత్ శర్మ అని చెప్పాడట. ఈ విషయంపై కోహ్లీ  మాట్లాడుతూ "టీ20ల్లో 16వ ఓవర్ తర్వాత రోహిత్ క్రీజులో ఉంటే ఎక్కడ బాల్ వేయాలో అర్థం కాదు. అతడి వద్ద అన్ని రకాల షాట్స్ ఉన్నాయి. చిన్నస్వామి స్టేడియంలో హిట్​మ్యాన్ ఇన్నింగ్స్​ను కోహ్లీ ఎప్పటికీ మర్చిపోడు" హిట్ మ్యాన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.