చెన్నై : ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గురువారం ఇండియాకు చేరుకున్నాడు. తెల్లవారుజామున చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన అశ్విన్‌కు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధికారులు ఘన స్వాగతం పలికారు. ‘రిటైర్మెంట్ చాలా మందికి ఉద్వేగభరితమైనది కావొచ్చు. కానీ నాకు వ్యక్తిగతంగా చాలా ఉపశమనం, సంతృప్తినిచ్చింది. చాలా సహజమైన ప్రక్రియ. కొన్ని రోజుల వరకు నా మదిలోనూ ఇది ఉంటుంది. ఆ తర్వాత అంతా సాధారణమైపోతుంది. నాకు సంబంధించినంత వరకు రిటైర్మెంట్ అనేది పెద్ద నిర్ణయం కాదు.
ఎందుకంటే నేను కొత్త మార్గంలో నడవబోతున్నా’ అని అశ్విన్ పేర్కొన్నాడు. టీమిండియా కెప్టెన్‌గా పని చేయనందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదన్నాడు. ఆ అవకాశం తనకు రాలేదని చెప్పిన ఈ తమిళ్ బౌలర్.. కెప్టెన్సీ రాకపోవడంతో పశ్చాత్తాపంలో మునిగిన వాళ్లను చాలా మందిని చూశానన్నాడు. ఎయిర్‌పోర్ట్ నుంచి తన కారులో ఇంటికి చేరుకున్న అశ్విన్‌ను ఫ్యామిలీ మెంబర్స్ ఘనంగా ఆహ్వానించారు. ప్రస్తుతానికి తాను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని చెప్పిన అశ్విన్ కొత్త లక్ష్యాలు ఏవీ పెట్టుకోలేదని స్పష్టం చేశాడు. వీలైనన్నీ రోజులు సీఎస్కేకు ఆడటానికి ప్రయత్నిస్తానని చెప్పాడు.
నా కుమారుడిని అవమానించారు : అశ్విన్ తండ్రి
అశ్విన్ రిటైర్మెంట్‌పై అతని తండ్రి రవిచంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజులుగా అశ్విన్ చాలా అవమానాలకు గురవుతున్నాడని, అనూహ్య రిటైర్మెంట్‌కు ఇది కూడా ఓ కారణం కావొచ్చన్నారు. ‘అశ్విన్ వీడ్కోలు నిర్ణయం నాకు కూడా చివరి నిమిషంలోనే తెలిసింది. ఈ అనూహ్య ప్రకటనతో మేమంతా షాకయ్యాం. రిటైర్మెంట్ అనేది అశ్విన్ ఇష్టం. ఇందులో నేను జోక్యం చేసుకోను.
అయితే ఇంత అనూహ్యంగా ప్రకటన చేయడం వెనక ఉన్న కారణాలపైనే నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. అవేంటో అశ్విన్‌కు మాత్రమే తెలుసు. కొన్ని అవమానాలు కూడా ఇందుకు కారణం కావొచ్చు. ఎవరైనా ఎన్నాళ్లు ఇలాంటి వాటిని సహిస్తారు. అందుకు సొంతంగా అతనే ఓ నిర్ణయానికి వచ్చి ఉంటాడు’ అని రవిచంద్రన్ వ్యాఖ్యానించాడు.