IND vs BAN 2024: విజయానికి 6 వికెట్ల దూరంలో: తొలి టెస్ట్‌లో గెలుపు దిశగా భారత్

IND vs BAN 2024: విజయానికి 6 వికెట్ల దూరంలో: తొలి టెస్ట్‌లో గెలుపు దిశగా భారత్

చెన్నై టెస్టులో భారత్ విజయం దిశగా దూసుకెళ్తుంది. 515 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. వెలుతురు లేని కారణంగా అరగంట ముందుగానే ఆటను నిలిపివేశారు. ప్రస్తుతం క్రీజ్ లో కెప్టెన్ శాంటో (51).. షకీబ్ (5) ఉన్నారు. భారత్ మరో 6 వికెట్లు తీస్తే గెలుస్తుంది. మరోవైపు బంగ్లాదేశ్ విజయం సాధించాలంటే  357 పరుగులు చేయాల్సి ఉంది.మరో రెండు రోజులు ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. 

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కు ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. జాకీర్ హుస్సేన్, షాదాబ్ ఇస్లామ్ తొలి వికెట్ కు 62 పరుగులు జోడించారు. ఈ జోడీని బుమ్రా విడదీయడంతో బంగ్లా వికెట్ల పతనం ప్రారంభమైంది. సొంతగడ్డపై తొలి ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్ తీసుకోలేకపోయిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం రెచ్చిపోయాడు. వరుసగా మూడు వికెట్లు తీసి బంగ్లాను కష్టాల్లో నెట్టాడు. ఒక ఎండ్ లో కెప్టెన్ శాంటో హాఫ్ సెంచరీతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో అశ్విన్ కు మూడు వికెట్లు దక్కాయి. జస్ప్రీత్ బుమ్రా ఒక వికెట్ పడగొట్టాడు. 

ALSO READ | IPL 2025: టీమిండియా నుంచి రాజస్థాన్‌కు: రాయల్స్ జట్టులో విక్రమ్ రాథోర్

మూడో రోజు గిల్ (119), పంత్ (109) సెంచరీలతో భారత్ తమ రెండో ఇన్నింగ్స్ 4 వికెట్లకు 287 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. భారత్ తమ తొలి ఇన్నింగ్స్ లో 376 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 149 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.