IND vs ENG 3rd Test: మెడికల్ ఎమర్జెన్సీ.. అశ్విన్ వైదొలగడానికి అసలు కారణం ఇదే

IND vs ENG 3rd Test: మెడికల్ ఎమర్జెన్సీ.. అశ్విన్ వైదొలగడానికి అసలు కారణం ఇదే

టీమ్ ఇండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు నుంచి వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వైదొలిగాడు. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా ఆర్ అశ్విన్ భారత్-ఇంగ్లాండ్ 3వ టెస్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.   రెండో రోజు ఆటలో భాగంగా క్రాలి వికెట్ తీసుకున్న అశ్విన్.. టెస్ట్ కెరీర్ లో 500 వికెట్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.   

రెండో రోజు ఆట ముగిసిన అనంతరం తక్షణమే వదిలిపెట్టి చెన్నైకి వెళ్లాడు. దీనికి సంబంధించి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఒక ప్రకటన విడుదల చేసింది. బీసీసీఐ అశ్విన్‌తో టచ్‌లోనే ఉన్నట్లు.. అవసరమైతే ఏదైనా సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అశ్విన్ కుటుంబం విషయంలో గోప్యతను గౌరవించాలని తెలిపింది. అయితే అశ్విన్ వైదొలగడానికి గల కారణాన్ని వెల్లడించలేదు. 

 
అశ్విన్ వైదొలగడానికి కారణం ఏమిటి?

ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పినా.. BCCI అసలు కారణం  చెప్పలేదు. అయితే నివేదికల ప్రకారం అశ్విన్ అమ్మ (చిత్రా అశ్విన్) అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తుంది. BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా అశ్విన్ అమ్మగారు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఆఫ్ స్పిన్నర్ విజయాల్లో అశ్విన్ తల్లి కీలక పాత్ర పోషించింది. తన తల్లి సిఫార్సుతో, అశ్విన్ స్పిన్ బౌలింగ్‌కు మారాడని.. అశ్విన్ 500 టెస్ట్ వికెట్లను పూర్తి చేసుకున్న తర్వాత తన తండ్రి వెల్లడించాడు. 

అశ్విన్ తన క్రికెట్ ప్రయాణాన్ని మీడియం పేసర్‌గా ప్రారంభించాడు. అయితే అతని తల్లి.. తన కొడుకును స్పిన్ బౌలింగ్‌ గా కెరీర్ కొనసాగించమని చెప్పేసరికి నేడు అశ్విన్ వరల్డ్ బెస్ట్ టెస్ట్ బౌలర్ గా ఎదిగాడు. భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 102 టెస్టుల్లో ఈ ఘనతను అందుకుంటే.. అశ్విన్ 98 టెస్టుల్లోనే 500 టెస్ట్ వికెట్లు పూర్తి చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 3000 పరుగులు, 500 వికెట్ల ఘనతను సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఓవరాల్ గా ఈ లిస్ట్ లో ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్, ఇంగ్లాండ్ పేస్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ అశ్విన్ కంటే ముందు ఈ ఫీట్ సాధించారు.