ఓడిపోయినందుకు ఎలాంటి బాధ లేదు : ఏనుగు రవీందర్ రెడ్డి

బాన్సువాడ, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోయినందుకు ఎలాంటి బాధ లేదని బాన్సువాడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన  కాంగ్రెస్ అభ్యర్థి, నియోజకవర్గ ఇన్​చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని పీఆర్ గార్డెన్ లో నిర్వహించిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో సర్పంచులు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అన్ని పదవులూ కాంగ్రెస్ పార్టీకే రావాలని సూచించారు.

గ్రామాల్లో ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేస్తే  ప్రజా ప్రతినిధులుగా మారుతారని, ఇందుకు తన నుంచి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ప్రజలకు ఆపద సంభవిస్తే తనకు ఫోన్ చేయాలని, హైదరాబాదులో మంచి వైద్యం అందిస్తానని తెలిపారు. ఇతర పార్టీ వాళ్లను  తాము ఏమీ అనబోమని, తమ పార్టీ వాళ్లను ఏమైనా  అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలను  తీర్చడానికి కృషి చేద్దామన్నారు.

తాను ఓడిపోయినా బాధ లేదని,  కేసీఆర్​ గద్దె దిగడం సంతోషంగా ఉందన్నారు. బాన్సువాడలో కొత్తకొండ భాస్కర్ లాంటి ఉద్యమకారులను పోచారం శ్రీనివాస్ రెడ్డి అణచివేశారని  వెల్లడించారు. ఇక్కడే ఇల్లు కట్టుకుని కార్యకర్తలు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సమావేశంలో  మాసాని శ్రీనివాస్ రెడ్డి, ఎలమంచిలి శ్రీనివాస్, నార్ల రత్నకుమార్, కొత్తకొండ భాస్కర్, ప్రతాప్ సింగ్ రాథోడ్, ఉద్దెర హనుమాన్లు, కాలిక్, అప్రోజ్ , మాసాని శేఖర్ రెడ్డి, వెంకటేశ్వరరావు దేశాయ్, గంగాధర్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.

వర్ని,వెలుగు: బాన్సువాడలో శుక్రవారం జరిగిన కాంగ్రెస్‌‌ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళానికి  ఉమ్మడి వర్ని మండలంలోని  పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.  వారిలో పార్టీ మండల  ప్రెసిడెంట్‌‌ సురేశ్‌‌బాబా , తదితరులు ఉన్నారు.