సీఎంఆర్ ధాన్యం అమ్ముకుంటే కేసులు పెట్టండి : రవీందర్‌‌‌‌సింగ్‌‌‌‌

  • సీఎంఆర్ ధాన్యం అమ్ముకుంటే కేసులు పెట్టండి
  • విజిలెన్స్​కు సివిల్ సప్లయ్స్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ రవీందర్‌‌‌‌సింగ్‌‌‌‌ ఆదేశం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : కస్టమ్‌‌‌‌ మిల్లింగ్‌‌‌‌ రైస్‌‌‌‌ (సీఎంఆర్‌‌‌‌) కోసం కేటాయించిన ధాన్యాన్ని మిల్లర్లు అమ్ముకుంటే క్రిమినల్‌‌‌‌ కేసులు పెట్టాలని సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ సంస్థ చైర్మన్‌‌‌‌ సర్దార్‌‌‌‌ రవీందర్‌‌‌‌ సింగ్‌‌‌‌ విజిలెన్స్‌‌‌‌ అధికారులను ఆదేశించారు. సోమవారం వారితో ఆయన సమావేశమయ్యారు. ఇటీవల జరిపిన తనిఖీల్లో ముఖ్యమైన అంశాలను అధికారులు చైర్మన్‌‌‌‌ దృష్టికి తీసుకొచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌‌‌‌లో ఏఆర్‌‌‌‌ఎం ఆగ్రో ఇండస్ట్రీస్‌‌‌‌కు 2021–22లో 2 సీజన్లలో 11,427 టన్నుల ధాన్యాన్ని కేటాయిస్తే 9,523 టన్నుల ధాన్యాన్ని మిల్లు యజమాని అమ్ముకున్నారని దీని విలువ దాదాపు రూ.18 కోట్లు ఉంటుందని ఈ సందర్భంగా అధికారులు చైర్మన్‌‌‌‌ దృష్టికి తీసుకొచ్చారు.

కేవలం 2 వేల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సీఎంఆర్‌‌‌‌ ఇచ్చారని తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌‌‌‌ మండలంలోని సుద్దాల స్టేజ్‌‌‌‌ 1 గోదాం నుంచి సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ సంస్థ ఎంఎల్‌‌‌‌ఎస్‌‌‌‌ పాయింట్‌‌‌‌కు గత సోమవారం నాడు 5 లారీల్లో బియ్యంలోడ్‌‌‌‌ పంపించింది. ఇందులో 420 బస్తాల చొప్పున ఉన్న 3 లారీలు మాత్రమే గోదాంకు చేరాయి.  ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.