IND vs BAN 2024: తొలి రోజు మనదే.. భారత్‌ను నిలబెట్టిన అశ్విన్, జడేజా

IND vs BAN 2024: తొలి రోజు మనదే.. భారత్‌ను నిలబెట్టిన అశ్విన్, జడేజా

చెన్నై వేదికగా చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజు టీమిండియా పై చేయి సాధించింది. ఒక దశలో భారత్ 144 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో ఏమైనా సంచలన ఫలితం నమోదవుతుందో అనే అనుమానం కలిగింది. అయితే ఆల్ రౌండర్లు రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బంగ్లాదేశ్ కు బౌలింగ్ జోరుకు అడ్డుకట్ట వేశారు. బౌలింగ్ లోనే కాదు బ్యాటింగ్ లోనూ టీమిండియాను ఆదుకోగలమని మరోసారి నిరూపించారు. 

వీరిద్దరూ భారీ భాగస్వామ్యంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 80 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. వీరిద్దరూ ఏడో వికెట్ కు అజేయంగా 195 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం తొలి రోజు మ్యాచ్ లో హైలెట్ గా నిలిచింది. బంగ్లా బౌలర్లకు ఏ మాత్రం అవకాశమివ్వకుండా అలవోకగా ఆడేశారు. ముఖ్యంగా అశ్విన్ వన్డే మ్యాచ్ ల బ్యాటింగ్ చేస్తూ సెంచరీ (102) బాదేశాడు. మరో ఎండ్ లో జడేజా (86) సైతం వేగంగా పరుగులు రాబట్టి సెంచరీ ముంగిట నిలిచాడు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు బంగ్లా బౌలర్ హసన్ మహ్మద్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. టీమిండియా టాపార్డర్ను కుప్పకూల్చాడు. ఈ 24 ఏళ్ల యువ పేసర్ ధాటికి టీమిండియా టాపార్డర్ చేతులెత్తేసింది. హసన్ మహ్మద్ బౌలింగ్లో రోహిత్ శర్మ(6) విరాట్ కోహ్లీ (6) సింగిల్ డిజిట్ కే పరిమితం కాగా..శుభ్మన్ గిల్ డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో భారత్ 34 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ జైశ్వాల్ 56 పరుగులు చేసి బాధ్యతాయుత బ్యాటింగ్ చేశాడు. 39 పరుగులు చేసి పంత్ అతనికి చక్కని సహకారం అందించాడు.