IND vs ENG 1st ODI: అంతర్జాతీయ క్రికెట్‪లో అరుదైన ఘనత.. కపిల్ దేవ్ సరసన జడేజా

IND vs ENG 1st ODI: అంతర్జాతీయ క్రికెట్‪లో అరుదైన ఘనత.. కపిల్ దేవ్ సరసన జడేజా

అంతర్జాతీయ క్రికెట్‌లో బెస్ట్ ఆల్ రౌండర్లలో రవీంద్ర జడేజా ఒకడు. ఫార్మాట్ ఏదైనా జడేజా తన ఆల్ రౌండ్ షోతో అదరగొడతాడు. క్రికెట్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ ఆల్ రౌండర్ ఒక అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. నాగ్‌పూర్ వేదికగా గురువారం(ఫిబ్రవరి 6) ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో బౌలింగ్ లో మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ లో 600 వికెట్లు తీయడంతో పాటు.. 6000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో భారత ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. ఆదిల్ రషీద్ వికెట్ తీసుకోవడం ద్వారా జడేజా ఈ అరుదైన లిస్ట్ లో చోటు సంపాదించాడు.  

తొలి ప్లేయర్ గా భారత మాజీ దిగ్గజం కపిల్ దేవ్ ఈ ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీ క్రికెట్ లో భారత్ తరపున కపిల్ దేవ్, జడేజా మాత్రమే 600 వికెట్లు.. 6000 పరుగులు చేసిన ఆటగాళ్లు కావడం విశేషం. జడేజా అంతర్జాతీయ క్రికెట్ లో 6641 పరుగులు చేయగా.. కపిల్ దేవ్ 9031 పరుగులు చేశాడు. ఓవరాల్ గా కపిల్ దేవ్, వసీం అక్రమ్, షకీబ్ అల్ హసన్, డేనియల్ వెట్టోరి, షాన్ పొల్లాక్ తర్వాత ఈ ఘనత అందుకున్న ఆరో క్రికెటర్ గా జడేజా నిలిచాడు. 600 వికెట్లు తీసుకున్న ఐదో భారత బౌలర్ జడేజా.  అనిల్ కుంబ్లే (953), రవిచంద్రన్ అశ్విన్ (765), హర్భజన్ సింగ్ (707) మరియు కపిల్ దేవ్ (687) ఈ లిస్ట్ లో అతని కంటే ముందున్నారు.  

జడేజా టెస్ట్‌లలో 323 వికెట్లు.. వన్డేలలో 223 వికెట్లు.. టీ20లలో 54 వికెట్లు తీసుకున్నాడు. బ్యాటింగ్ లో మూడు ఫార్మాట్లలలో కలిపి 6641 పరుగులు చేశాడు. 2009లో కొలంబోలో శ్రీలంకపై అరంగేట్రం చేసిన జడేజా.. 15 ఏళ్ళ పాటు భారత ఆల్ రౌండర్ గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2024లో భారత్ టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో టీ20ల నుంచి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం జడేజా వన్డే, టెస్ట్ క్రికెట్ లో కొనసాగుతున్నాడు.