టీమ్ ఇండియా 2011 వన్డే ప్రపంచ కప్ ఇప్పటికీ ప్రతి భారత అభిమాని మనసులో తాజాగా ఉంటుంది. మహేంద్ర సింగ్ ధోని సిక్సర్ కొట్టి విన్నింగ్ రన్స్ చేసిన దగ్గర నుంచి యువరాజ్ సింగ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనల వరకు, ఈ వరల్డ్ కప్ లో ఎన్నో విలువైన క్షణాలు ఉన్నాయి. జట్టు సమిష్టి ప్రదర్శన, కెప్టెన్ గా ధోనీ జట్టుని ముందుండి నడిపించిన తీరు భారత్ కి వరల్డ్ కప్ ని తీసుకొచ్చింది. అయితే ఆ తర్వాత జరిగిన రెండు వరల్డ్ కప్ లో టీమిండియా బాగా ఆడినా సెమీస్ లోనే నిష్క్రమించింది.
ఇక ఈ సారి వరల్డ్ కప్ భారత్ లోనే జరగనుండడంతో అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఈ అంచనాలను మరింతగా పెంచేస్తూ 2023 వరల్డ్ కప్ భారత్ గెలుస్తుందని భారత స్టార్ ఆల్ రౌండర్ జడేజా అభిమానులకి భరోసా ఇచ్చాడు.సహచరులతో కలిసి ప్రపంచ కప్ ఫైనల్‌ను వీక్షించడం గురించి మాట్లాడుతూ.. 2011 వరల్డ్ కప్ జ్ఞాపకాలు ఇప్పటికీ తన మనసులో అలాగే ఉన్నాయని తెలిపాడు.
"ఫైనల్‌ను చూడటానికి సహచరులందరూ ఒకే గదిలో కూర్చున్నారు. భారత్ ప్రారంభంలో వికెట్లు కోల్పోయిన తర్వాత మేమంతా కొంచెం కంగారుపడ్డాము. కానీ ఎంఎస్ ధోనీ, గౌతమ్ గంభీర్ మ్యాచ్‌ని మా వైపు తిప్పారు. నాకు ఆ రాత్రి అంతా ఇంకా గుర్తుంది. భారత క్రికెట్‌కు ఇది చాలా ప్రత్యేకమైన క్షణం. ప్రపంచకప్ గెలవాలని అభిమానుల నుండి చాలా అంచనాలు ఉన్నాయి. 2011 లో జ్ఞాపకాలను మరోసారి అభిమానులకి అందిస్తాం". అని చెప్పాడు. కాగా.. ఈ వరల్డ్ కప్ లో భారత్ అక్టోబర్ 8 న ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడబోతుంది.