బీఆర్ఎస్, కాంగ్రెస్​వి మోసపూరిత వాగ్ధానాలు : రావుల రాంనాథ్

లక్ష్మణచాంద(మామడ), వెలుగు: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మేనిఫెస్టోల పేరుతో ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర నేత రావుల రాంనాథ్ ఫైర్​ అయ్యారు. మామడ మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కేసీఆర్ గతంలో ఇచ్చిన అనేక వాగ్దానాలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు.

దళితుడ్ని సీఎం చేయడం, దళిత గిరిజనులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగు నీరు, ప్రతి ఇంటికి మంచి నీరు, పేద ప్రజలకు పీజీ టూ కేజీ వరకు ఉచిత విద్య అంటూ అనేక హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రావడంతో ప్రజలను నమ్మించి మోసం చేయాలని చూస్తున్నాడని విమర్శించారు.

ఇప్పటికే రాష్ట్రం రూ.ఐదు లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. ఆ అప్పులు ఎలా తీరుస్తారో చెప్పకుండానే మళ్లీ మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారని ఫైర్​ అయ్యారు. రాష్ట్రం, కేంద్రంలో అధికారం లేకుండా  తమ హామీలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి నిధులు తెస్తుందో చెప్పాలన్నారు. కేవలం కర్ణాటకను నమ్ముకొని కోట్ల రూపాయలు తీసుకువచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసే పనిలో కాంగ్రెస్ పార్టీ నిమగ్నమైందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. బీజేపీ సీనియర్ నాయకులు బాపురెడ్డి, గోవర్ధన్, లింగం యాదవ్, నరేష్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.