ఖానాపూర్, వెలుగు: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ విజయ సంకల్ప యాత్ర చేపట్టనుందని అదిలాబాద్ పార్లమెంట్ యాత్ర ఇన్ చార్జి రావుల రాంనాథ్ అన్నారు. మంగళవారం ఖానాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 20న అదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని బాసర అమ్మవారి పుణ్యక్షేత్రం నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు.
అదిలాబాద్, నిజామాబాద్ ,పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు కుమ్రం భీం క్లస్టర్‌గా నామకరణం చేశామన్నారు. 10 రోజులపాటు మూడు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 22 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగే బీజేపీ విజయ సంకల్ప యాత్రకు ప్రజలు, మేధావులు రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. అధికారంలోకి రాకముందు కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరుకుతామని గొప్పలు చెప్పుకున్న రేవంత్ సర్కార్.. అధికారంలోకి వచ్చాక సీబీఐకి బదులు విజిలెన్స్ విచారణ జరపడం సిగ్గుచేటన్నారు.
బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలు అసెంబ్లీ వేదికగా డ్రామాలాడుతూ ప్రజల సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నాయని ఫైర్అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చే శారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాయిని సంతోష్, జిల్లా కో కన్వీనర్ రవీందర్ రెడ్డి, నాయకులు దాదే మల్లయ్య, లక్కవత్తుల రాజేశ్వర్, పొద్దుటూరి గోపాల్ రెడ్డి, సయ్యద్ రుస్తుం, సుధాకర్ , వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.