- సంగమేశ్వరం నుంచి ప్రాజెక్టు సైట్ మార్చాం
- ఎన్‌జీటీ చెన్నై బెంచ్‌కి చెప్పిన ఏపీ ప్రభుత్వం
- ప్రాజెక్టు పనులు చేయట్లేదని మరోసారి బుకాయింపు
హైదరాబాద్, వెలుగు: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పక్కనే రాయలసీమ లిఫ్ట్ నిర్మిస్తున్నామని ఏపీ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ)కు తెలిపింది. ప్రాజెక్టు సైట్‌ను సంగమేశ్వరం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సమీపానికి మార్చామని అంగీకరించింది. ఎన్‌జీటీ ఆదేశాలను ధిక్కరించి ఏపీ ప్రభుత్వం సంగమేశ్వరం లిఫ్ట్ స్కీం పనులు చేస్తోందని నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ వేసిన పిటిషన్‌ను ఎన్‌జీటీ (చెన్నై) బెంచ్ జ్యుడిషియల్ మెంబర్ జస్టిస్ రామకృష్ణన్, ఎక్స్‌పర్ట్ మెంబర్ సైబల్ దాస్ గుప్తా మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు అడ్వొకేట్ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సమీపంలో పంపుహౌస్ పనులు వేగంగా చేస్తోందని తెలిపారు. డీపీఆర్ రూపొందించేందుకు ఇన్వెస్టిగేషన్ పేరుతో పనులు కొనసాగిస్తోందని, వాటిని కేంద్ర పర్యావరణ శాఖ, ఐఐటీ హైదరాబాద్, కేఆర్‌ఎంబీతో గతంలో ఏర్పాటు చేసిన ఎక్స్‌పర్ట్ కమిటీతో తనిఖీ చేయించాలని కోరారు.
పనులు చేస్తలే.. లేదు చేస్తున్నరు..
ఏపీ తరఫున సీనియర్ అడ్వొకేట్ వెంకటరమణి వాదనలు వినిపిస్తూ.. తాము ప్రాజెక్టు పనులు చేయడం లేదన్నారు. డీపీఆర్ రూపొందించేందుకు అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ మాత్రమే చేస్తున్నామని చెప్పారు. పిటిషనర్ తరఫు అడ్వొకేట్ జోక్యం చేసుకుని..ఏపీ ప్రాజెక్టు పనులు కొనసాగిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రామచందర్‌రావు స్పందిస్తూ.. సైట్ ఇన్వెస్టిగేషన్ సహా అన్ని పనులను గత వేసవిలోనే ఏపీ పూర్తి చేసిందని, ఇప్పుడు ప్రాజెక్టు పనులు చేస్తోందని చెప్పారు. ఈ సమయంలో ఏపీ అడ్వొకేట్ స్పందిస్తూ తాము పనులు చేయడం లేదని ఎన్‌జీటీ ఎదుట అఫిడవిట్ ఫైల్ చేశామని, అక్కడ ఏం చేస్తున్నామనే వివరాలన్నీ అందులో పేర్కొన్నామన్నారు. తాను మరో కేసు విచారణకు హాజరుకావాల్సి ఉందని, విచారణను వాయిదా వేయాలని కోరారు. జ్యూడిషియల్ మెంబర్ జస్టిస్ రామకృష్ణన్ స్పందిస్తూ.. ఏపీ సర్కారు ఫైల్ చేసిన అఫిడవిట్‌పై అభ్యంతరాలు ఏమైనా ఉంటే రాతపూర్వకంగా సమర్పించాలని ఆదేశించారు. విచారణను ఈనెల 16కు వాయిదా వేశారు.
పోతిరెడ్డిపాడుకు ఉత్తరం వైపు పంపుహౌస్
రాయలసీమ లిఫ్ట్ స్కీం పంపుహౌస్ లొకేషన్ మార్చామని ఏపీ ప్రభుత్వం ఎన్‌జీటీకి సమర్పించిన అఫిడవిట్‌లో వివరించింది. ప్రాజెక్టు పనులపై పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలకు ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సమాధానాలు ఇచ్చారు. సంగమేశ్వరం వద్ద పంపుహౌస్ నిర్మించి, అక్కడి నుంచి 22 కి.మీ.ల కాలువ ద్వారా శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్‌కు నీటిని తరలించాల్సి ఉందన్నారు. కాలువ తవ్వడానికి 500 ఎకరాల ప్రైవేటు భూములు సేకరించాల్సి ఉందని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు ఉత్తరం వైపున పంపుహౌస్ నిర్మించేందుకు భూమి చదును చేశామన్నారు. ఇక్కడ పంపుహౌస్ నిర్మిస్తే భూసేకరణ చేయాల్సిన అవసరం ఉండదని చెప్పారు. పంపుహౌస్ ప్రతిపాదిత ప్రాంతంలో జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నామని, భూగర్భంలో ఎలాంటి మట్టిపొరలు ఉన్నాయో తెలుసుకునేందుకు 3 బోర్లు వేశామన్నారు. సీడబ్ల్యూసీకి డీపీఆర్ ఇవ్వడానికే ఈ పనులు చేస్తున్నామని, పంపులు, మోటార్లు అమర్చబోరని, 30 నుంచి 40 మీటర్ల లోపల పంపులు, మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 880 అడుగుల లెవల్‌లో నీటి మట్టం ఉన్నప్పుడు సంగమేశ్వరం వద్ద 80 మీటర్ల నీళ్లు నిలిచి ఉంటాయని, అక్కడ పనులు చేసే అవకాశమే ఉండదని తెలిపారు.
For More News..