మాడు పగిలే ఎండలు ఇదే నెలలో ఉండనున్న వేళ అందరూ చల్లటి పదార్థాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. అందులో కూల్ డ్రింక్స్ ప్రత్యేకతే వేరు. కూల్ డ్రింక్స్ లో విభిన్న రకాలు మార్కెట్లో దొరుకుతున్నా ప్రకృతి నుంచి సహజంగా వచ్చిన వాటిని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాంటి వాటిల్లో మొదట వినిపించే పేరు నన్నారి షర్బత్. ఏంటి పేరు ఎక్కడా విన్నట్లు అనిపించట్లేదా.. సరే పదండి మరి ఆ కూల్ డ్రింక్ సంగతేంటో చూద్దాం...
రాయలసీమ అంటే రాగి సంకటే కాదండోయ్...
రాయలసీమ అనగానే తినే పదార్థాలలో ఏది మొదటగా వినిపిస్తుంది. రాగి సంకటి అంతేనా... అదే సమ్మర్ లో ఏం వినిపిస్తుందనుకుంటున్నారు.. నన్నారి కఠోర పాలు. వినడానికి కొత్తగా ఉన్నా రాయలసీమలో ఇది తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. తరచూ కూల్ డ్రింక్ ని ఆశ్రయించేబదులు నన్నారి షర్బత్లో కొంచెం సబ్జా గింజలు కలిపి తాగితే శరీరం క్షణాల్లో చల్లబడుతుంది.
తయారీ విధానం ఇదే...
సుమారు 40 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పానీయాన్ని సుగంధ షర్బత్ అని కూడా అంటారు. సుగంధి పాల చెట్టు వేళ్లను కత్తిరించి, వాటిని బాగా ఎండబెట్టిన తరువాత కషాయం చేస్తారు. (నల్లమల అడవుల్లో ఇవి లభిస్తాయి)ఈ కషాయానికి పంచదార చేర్చి, పాకాన్ని తయారు చేస్తారు. దీనితో కలపి తయారు చేసే షర్బత్ ఆ ప్రాంతంలో చాలా ఫేమస్. ఇటీవల ఈ పానీయం హైదరాబాద్ తదితర జిల్లాల్లో దొరుకుతున్నా.. రాయలసీమ వాసుల నైపుణ్యమే వేరు.
ఉపయోగాలివే..
వేసవి తాపాన్ని తగ్గించడంలో, చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో షర్బత్ అద్భుతంగా పని చేస్తుందట. సుగంధ పాల చెట్టును ఆయుర్వేద చికిత్సల్లో నూ ఉపయోగిస్తారు.
ఈ సారి రాయలసీమ వెళ్తే ఈ పానీయం రుచి తప్పక చూడండి. ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటే ఈ కామర్స్ వెబ్ సైట్ లలో, పలు సూపర్ మార్కెట్లలోనూ అందుబాటులో ఉంటాయి.