- రాయపర్తి ఎస్‍బీఐలో చోరీ ఘటనకు రెండు నెలలు
- రూ.13.61 కోట్ల విలువైన 19 కిలోల గోల్డ్ లూటీ
- ముగ్గురు దొంగల నుంచి 2 .520 కిలో గ్రాములు స్వాధీనం
- ప్రధాన నిందితుడితో పాటు పరారీలోనే మరో ముగ్గురు
- ఇంకా 16.5 కిలోల గోల్డ్ రికవరీపై నో ప్రోగ్రెస్
- నగల కోసం బ్యాంకు చుట్టూ తిరుగుతున్న బాధితులు
వరంగల్/రాయపర్తి, వెలుగు : ఎస్‍బీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగి రెండు నెలలు దాటినా వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఇంకా కేసును ఛేదించలేకపోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా చరిత్రలోనే అతిపెద్ద బ్యాంక్ రాబరీగా నిలవడమే కాకుండా దర్యాప్తు కూడా పోలీసులకు చాలెంజ్ గా మారింది. ఘటన జరిగిన 15 రోజుల్లోనే దొంగల ఆచూకీ తెలుసుకుని ముగ్గురిని పట్టుకుని..
కొట్టేసిన ఆభరణాల్లో 2 .520 కిలో గ్రాముల ఆభరణాలు రికవరీ చేశారు. మరో నలుగురు నిందితులు దొరకాల్సి ఉంది. నెలన్నర గడిచినా ఇంకా కేసులో ఎలాంటి ప్రోగ్రెస్ లేదు. మరోవైపు రికవరీ చేసిన ఆభరణాలు బ్యాంకుకు చేరలేదు. దీంతో బాధితులు బ్యాంకు చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది.
గూగుల్ మ్యాప్ లో చూసి..రెక్కీ వేసి..
వరంగల్ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఖమ్మం హైవేపై రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్‍బీఐ బ్యాంకులో గత నవంబర్ అర్ధరాత్రి చోరీ జరిగింది. గూగుల్‍లో సెర్చ్ చేసి గ్రామీణ ప్రాంతంలోని ఎస్‍బీఐ బ్యాంకును దొంగల ముఠా ఎంపిక చేసుకుని రెండు మూడుసార్లు రెక్కీ చేసి లూటీకి పాల్పడింది. అర్ధరాత్రి కారులో వచ్చి గ్యాస్ కట్టర్లతో బ్యాంకులోని లాకర్లు ఓపెన్ చేసి ఆభరణాలను ఎత్తుకెళ్లింది.
మొదట రూ.10 కోట్ల విలువైన సొత్తు చోరీ చేశారని భావించినా.. చివరకు రూ.13.61 కోట్ల విలువైన 19 కిలోల ఆభరణాలు చోరీ అయినట్టు పోలీసులు కన్ఫర్మ్ చేశారు. 635 మంది బాధిత రైతుల బంగారు ఆభరణాలు చోరీ అయినట్టు వెల్లడించారు.
దొరకని దొంగల వద్ద 87 శాతం ఆభరణాలు
ఇంకా పట్టుబడని దొంగల వద్ద 87 శాతం గోల్డ్ ఉండిపోయింది. యూపీలోని బదౌన్ జిల్లా కక్రలాకు చెందిన ప్రధాన నిందితుడు మహమ్మద్ నవాబ్ హసన్(39)తో పాటు సాజిద్ ఖాన్(35), మహారాష్ట్రకు చెందిన అక్షయ్ గజానన్ అంబోర్(24), సాగర్ భాస్కర్ గోర్ (32) అరెస్ట్ ను పోలీసులు ఇంకా చూపలేదు. ఆభరణాలు చోరీ అయిన బాధితుల్లో 635 మంది ఉన్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. ఇందులో ఎక్కువగా రైతులు ఉన్నారు. వ్యవసాయానికి, వివిధ అవసరాల కోసం నగలు బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు.
గత డిసెంబర్ లో పంట చేతికి రాగానే లోన్ క్లియర్ చేసి సంక్రాంతిలోపు ఆభరణాలు తీసుకోవాల్సి ఉంది. రాష్ట్ర సర్కార్ రుణమాఫీ తో చాలామంది రైతులు మిగిలిన డబ్బులతో తమ గోల్డ్ ను విడిపించుకునేందుకు రెండు నెలలుగా బ్యాంకు చుట్టూ తిరిగి వెళ్తున్నారు. బాధితులు బ్యాంకు అధికారులను అడిగితే కోర్టులో ఉందనే సమాధానమే చెబుతున్నారు.
ముగ్గురు అరెస్ట్.. 2.520 కిలో గ్రాములు రికవరీ
వరంగల్ కమిషనరేట్ పోలీసులు మొదటి15 రోజుల్లోనే చోరీ కేసును చేధించడంలో సక్సెస్ అయ్యారు. దొంగలు సీసీ పుటేజీలు ధ్వంసం చేసి ఎలాంటి ఆధారాలు లేకుండా చేసి వెళ్లారు. అయితే.. దోపిడీ సమయంలో అటువైపు వెళ్లిన వెహికల్స్ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టి పురోగతి సాధించారు. మహారాష్ట్ర, యూపీలకు చెందిన నిందితులుగా గుర్తించి.. ముఠాలోని అర్షద్, షాకీర్ ఖాన్, హిమాన్షు బిగామ్ ను అరెస్ట్ చేశారు. వారి ద్వారా రూ.1 కోటి 80 లక్షల విలువైన 2 .520 కిలో గ్రాముల ఆభరణాలు రికవరీ చేశారు.