రాయదుర్గంలో నిత్యపెళ్లి కొడుకు..పదుల సంఖ్యలో యువతులను మోసం చేసిన క్రిష్ణ చౌదరి

రాయదుర్గంలో నిత్యపెళ్లి కొడుకు..పదుల సంఖ్యలో యువతులను మోసం చేసిన క్రిష్ణ చౌదరి
  • విగ్గులతో వేషం మార్చి మ్యాట్రిమోని ద్వారా  కాంటాక్ట్
  • ఓ బాధితురాలి పేరెంట్స్ ఫిర్యాదుతో విషయం వెలుగులోకి
  • నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు

గచ్చిబౌలి, వెలుగు:పెండ్లి పేరుతో పదుల సంఖ్యలో యువతుల నుంచి డబ్బు వసూలు చేసి మోసం చేస్తున్న నిత్య పెళ్లికొడుకుపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసుల ప్రకారం..రాయపాటి క్రిష్ణ చౌదరి అనే వ్యక్తి తెలుగు మ్యాట్రిమోనిలో 'కోట్ల ఆస్తి ఉన్న తనకు వధువు కావలెను' అని తన ఫొటోలతో ప్రొఫైల్ అప్ లోడ్ చేశాడు. అది నమ్మి వచ్చిన యువతుల నుంచి లక్షల రూపాయలు కట్నంగా వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. విగ్గులతో వేషం మార్చి పెండ్లి పేరుతో యువతుల వద్ద డబ్బు వసూలు చేయటమే దందాగా మార్చుకున్నాడు.

వచ్చిన డబ్బులతో రాయల్ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఇలా ఇప్పటిదాకా పదుల సంఖ్యలో యువతులను అతడు పెండ్లి చేసుకుని మోసం చేశాడు. తాజాగా  తెలుగు మ్యాట్రిమోని ద్వారా  ఐటి కారిడార్ పరిధిలోని ఖాజాగూడకు చెందిన ఓ లేడీ డాక్టర్(30)ను కలిసి పెండ్లి చేసుకుంటానని చెప్పాడు. పెండ్లికి యువతి కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పారు. 

ఎంగేజ్మెంట్ షాపింగని డబ్బు వసూలు

యువతి పేరెంట్స్ పెండ్లికి అంగీకరించడంతో క్రిష్ణ చౌదరి తన అసలు క్యారెక్టర్ బయటపెట్టాడు.తనకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, ఎంగేజ్మెంట్ షాపింగ్ కోసం డబ్బులు సర్దుబాటు చేస్తే అస్ట్రేలియా నుంచి తన తల్లిదండ్రులు వచ్చిన తరువాత తిరిగి ఇస్తానని యువతి ఫ్యామిలీని నమ్మించాడు. దాంతో యువతి తల్లిదండ్రులు అతనికి రూ. 21 లక్షలు ఇచ్చారు. డబ్బు తీసుకున్న నాటి నుంచి క్రిష్ణ చౌదరి అందుబాటులో లేకుండా పోయాడు. అతని ఆచూకీ  తెలియకపోవడంతో తాము మోసపోయినట్లు గుర్తించిన యువతి తల్లిదండ్రులు ..

ఈ నెల 12న రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. రాయపాటి క్రిష్ణ చౌదరి నిత్యపెళ్లి కొడుకు అని పోలీసులు తమ దర్యాప్తు ద్వారా నిర్ధారించారు. విగ్గులతో వేశాలు మార్చి పెండ్లి పేరిట పదుల సంఖ్యలో యువతుల వద్ద డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. అతనిపై గతంలోనూ ఇదే తరహా కేసు నమోదు అయినట్లు  తెలిపారు. నిత్యపెళ్లి కొడుకు కోసం గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు.