రాయపట్నం మిర్చి మార్కెట్​20 ఏండ్లుగా రోడ్డు పక్కనే

  • ఉత్తర తెలంగాణలోనే ఇదే అతి పెద్ద మిర్చి మార్కెట్

జగిత్యాల, వెలుగు: ఉత్తర తెలంగాణలోనే అతి పెద్దదైన జగిత్యాల జిల్లాలోని రాయపట్నం మిర్చి మార్కెట్ 20 ఏండ్లుగా రోడ్డు పక్కనే కొనసాగుతోంది. నేషనల్ హైవేను ఆనుకొని ఉండడంతో అటు రైతులు, ఇటు వ్యాపారులకు ఈ ఏరియా అనుకూలంగా ఉంటోంది. ఏటా ఇక్కడ రూ.70 కోట్ల వరకు మిర్చి బిజినెస్​జరుగుతోంది. రాయపట్నంలో మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలని10 ఏండ్లుగా మిర్చి రైతులు డిమాండ్​చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

దీంతో రైతులు చేతికొచ్చిన పంటను బస్తాల్లో నింపుకుని గ్రామంలోని హైవే పక్కన, ఇండ్ల ముందు దించుతున్నారు. వ్యాపారులు అక్కడికి వచ్చి పంటను కొనుగోలు చేస్తున్నారు. అయితే అధిక మొత్తంలో పంట మార్కెట్​కు వచ్చిన టైంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దించే తావు లేక రైతులు, స్థానికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి రాయపట్నంలో మార్కెట్ యార్డు ఏర్పాటు చేస్తే ఏటా రూ.150 కోట్ల బిజినెస్ జరిగే అవకాలు ఉన్నట్లు రైతులు, వ్యాపారులు చెబుతున్నారు.

23 వేల టన్నుల మిర్చి అమ్మకాలు

జగిత్యాల జిల్లాలో రాయపట్నం చివరి గ్రామం. ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్ హైవేలు ఈ గ్రామానికి ఆనుకుని వెళ్తున్నాయి. దీంతో ఇక్కడ మిర్చి మార్కెట్ సక్సెస్​ఫుల్​గా కొనసాగుతోంది. రాయపట్నం, పరిసర ప్రాంతాల రైతులు మిర్చి పంట ఎక్కువగా సాగు చేస్తుంటారు. స్థానికులే ఎక్కువ మంది వ్యాపారులుగా ఉన్నారు. మహదేవ్ పూర్, చెన్నూర్, అన్నారం, మహారాష్ట్ర, సిరివంచ, దేవులాడ, జనగామ ప్రాంతాల్లోని మిర్చిని ఇక్కడికి తెచ్చి అమ్ముతుంటారు. ఏటా రాయపట్నం మార్కెట్ లో 2-3 వేల టన్నుల మిర్చి బిజినెస్​ జరుగుతోంది.

మిర్చికి మంచి రేటు 

దేశ వ్యాప్తంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌‌, పశ్చిమ బెంగాల్‌‌రాష్ట్రాల్లో మిర్చి అధికంగా సాగవుతోంది. వీటిలో 4 లక్షల మెట్రిక్ టన్నులు పండిస్తూ మిర్చి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో కర్ణాటక, మహారాష్ట్రలో మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. దిగుబడిపై భారీగా ఎఫెక్ట్ పడింది. దీంతో ఉత్తర తెలంగాణలో కీలకంగా ఉన్న రాయపట్నం మార్కెట్​కు వస్తున్న మిర్చికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. క్వింటాల్ కు రూ.25 వేలకు పైనే పలుకుతోంది. గతేడాది క్వింటాల్ రూ.18వేలు పెట్టి కొనగా, ఈసారి సీజన్​మొదట్లోనే మంచి రేట్లు పడుతున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఇండ్ల ముందు, రోడ్డు పక్కన

పేరుకు అతి పెద్ద మార్కెట్ అయినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి వసతులు కల్పించడం లేదు. దీంతో రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలకు పొలంలోనే పంటలు దెబ్బతినడంతో, రైతుల చేతికొచ్చిన పంటకు డిమాండ్​పెరిగింది. అమ్ముకుందామని మార్కెట్ కు తెచ్చిన పంటను స్టోర్ చేసేందుకు షెడ్లు, గోదాంలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొన్న పంట ఎక్కడ పెట్టాలో అర్థం కావడం లేదని వ్యాపారులు వాపోతున్నారు.

చేసేదేం లేక అటు రైతులు, ఇటు వ్యాపారులు మిర్చిని బస్తాల్లో నింపి ఇండ్ల ముందు, హైవే పక్కన స్టోర్​చేస్తున్నారు. కొంత మంది వ్యాపారులు పొలాలను లీజుకు తీసుకుని కొన్న పంటను అందులో వేసి టార్పలిన్లు కప్పుతున్నారు. ప్రభుత్వం మార్కెట్ యార్డు ఏర్పాటు చేస్తే మిర్చితో పాటు మక్క, దోస, కూరగాయల వ్యాపారం చేసుకునేందుకు వీలుంటుందని రైతులు చెబుతున్నారు. 

మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలి

నల్లి పురుగు సోకడంతో దిగుబడి తగ్గింది. ఉన్న పంటకు మంచి రేటు పడుతోంది. కేజీ మిర్చి రూ.250 వరకు ఉంది. మహదేవ్ పూర్, చెన్నూర్, అన్నారం, సిరివంచ, దేవులాడ, జనగాం, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల నుంచి మిర్చి వస్తోంది. ప్రభుత్వం మార్కెట్ యార్డు ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది. అకాల వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. - సురేశ్, రైతు, రాయపట్నం

అకాల వర్షాలతో తీవ్ర ఇబ్బందులు 

కొన్నేండ్లుగా మిర్చి యార్డు లేకపోవడంతో కొన్న పంటను రోడ్డు పక్కన, ఇండ్ల ముందు స్టోర్​ చేయాల్సి వస్తోంది. అకాల వర్షాలకు ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం స్పందించి యార్డు ఏర్పాటు చేస్తే మిర్చితోపాటు స్థానికంగా పండిస్తున్న దోస, మక్క, కూరగాయల కొనుగోళ్లు పెరుగుతాయి. మరింత మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. - రమేశ్, మిర్చి వ్యాపారి, రాయపట్నం