ముంబయి : డిజిటల్ పేమెంట్స్ను మరింత విస్తృతం చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్.. యూపీఐతో క్రెడిట్ కార్డులను లింక్ చేయాలని ప్రతిపాదించింది. రూపే కార్డులతో ఈ విధానాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. దీని వల్ల కస్టమర్లు మరింత సులువుగా పేమెంట్స్ చేసుకునే వీలుంటుందని అభిప్రాయపడింది. ఇందుకు అవసరమైన వ్యవస్థను మరింత మెరుగుపరచాల్సి ఉందని చెప్పింది. యూపీఐలతో క్రెడిట్ కార్డుల అనుసంధానానికి సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుతం డెబిట్ కార్టులను మాత్రమే యూపీఐలతో అనుసంధానించే వీలుంది. ఖాతాదారుల సేవింగ్స్ అకౌంట్ నుంచి యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సేవలను మరింత విస్తృతం చేసేందుకుగానూ ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రస్తుతం 26 కోట్ల మంది యూపీఐ యూజర్లు ఉన్నారు. మే నెలలో యూపీఐ ద్వారా 10.40 లక్షల కోట్ల విలువైన 594.63 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ఆర్బీఐ ప్రకటించింది.