
న్యూఢిల్లీ: బ్యాంకుల లిక్విడిటీ (సరిపడినంత ఫండ్స్ ఉండడం) సమస్యలను తీర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) చర్యలు మొదలు పెట్టింది. రూ.60 వేల కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేస్తామని ప్రకటించింది.
మూడు దశల్లో వీటిని కొనుగోలు చేస్తుంది. దీంతో పాటు డాలర్–రూపాయి బై/సెల్ స్వాప్ ఆక్షన్‌ను చేపడతామని ప్రకటించింది. ఇందులో భాగంగా 5 బిలియన్ డాలర్లను బ్యాంకుల నుంచి ఆర్‌బీఐ కొనుగోలు చేస్తుంది.
ఇంతే మొత్తంలో రూపాయలను ఇస్తుంది. టెనూర్ ఆరు నెలలు. ఆ తర్వాత అంతే మొత్తంలో డాలర్లను రూపాయిలకు తిరిగి బ్యాంకులకు అమ్ముతుంది. ఈ ఆక్షన్‌ను జనవరి 31 న చేపట్టనుంది. బ్యాంకింగ్ సిస్టమ్‌లో లిక్విడిటీ పెంచేందుకు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంఓ) ఆక్షన్స్ కింద రూ.60 వేల కోట్ల ప్రభుత్వ బాండ్లను ఆర్‌బీఐ కొనుగోలు చేస్తుంది.
మొదటి దశలో రూ.20 వేల కోట్ల బాండ్లను జనవరి 30న, రెండో దశలో మరో రూ.20 వేల కోట్ల బాండ్లను ఫిబ్రవరి 13న, మూడో దశలో రూ.20 వేల కోట్ల బాండ్లను ఫిబ్రవరి 20న కొనుగోలు చేయనుంది.
వీటితో పాటు ఫిబ్రవరి 7న 56 రోజుల కాలవ్యవధి ఉండే వేరియేబుల్ రేట్ రెపో (వీఆర్‌ఆర్) ఆక్షన్‌ను చేపడతామని ఆర్‌బీఐ ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.50 వేల కోట్లను వీఆర్‌ఆర్ రేటుకే బ్యాంకులకు అప్పు ఇస్తుంది. లిక్విడిటీ పరిస్థితులను గమనిస్తామని, పరిస్థితులకు తగ్గట్టు చర్యలు తీసుకుంటామని పేర్కొంది.