ముంబై: తగినంత మూలధనం, ఆదాయం లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ నగరం విజయవాడ కేంద్రంగా పనిచేసే దుర్గా కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌ను రద్దు చేస్తున్నట్టు ఆర్‌బీఐ వెల్లడించింది. మంగళవారం వ్యాపారం ముగిసే సమయానికి ఈ బ్యాంక్ తన వ్యాపారాన్ని నిలిపివేస్తుందని ప్రకటించింది.
బ్యాంకు మూసివేతకు, లిక్విడేటర్ నియామకానికి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఆంధ్ర ప్రదేశ్‌లోని సహకార కమిషనర్, రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్‌ను కూడా కోరింది. లిక్విడేషన్ తరువాత రూ.లక్షల వరకు ప్రతి డిపాజిటర్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) కింద పొందవచ్చు. బ్యాంకు సమర్పించిన డేటా ప్రకారం, డిపాజిటర్లలో 95.8 శాతం మంది డీఐసీజీసీ నుంచి తమ డిపాజిట్ల పూర్తి మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులని ఆర్‌బీఐ తెలిపింది. ఆగస్టు 31, 2024 నాటికి, డీఐసీజీసీ బీమా చేసిన డిపాజిట్లలో రూ.9.84 కోట్లను ఇప్పటికే చెల్లించింది.