
RBI MPC Meeting: భారతీయ రిజర్వు బ్యాంక్ ప్రతి రెండు నెలలకు ఒకసారి ద్రవ్యపరపతి సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీని ద్వారా మార్కెట్లో లిక్విడిటీని నిర్థారిస్తుంది. దేశంలోని ద్రవ్యోల్బణంతో పాటి ఆర్థిక వృద్ధి వంటి ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటూ కీలక వడ్డీ రేట్ల విషయంలో మార్పులను చేపడతుంది.
ప్రపంచ దేశాలపై ట్రంప్ వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించిన వేళ అప్రమత్తంగా ముందుకు సాగుతున్న రిజర్వు బ్యాంక్ కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కీలక రెపో రేటు 6 శాతానికి తగ్గింది. దేశంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో ఈఎంఐ చెల్లింపుదారులపై భారం తగ్గనుంది.
జీడీపీ వృద్ధి రేటు అంచనాల తగ్గింపు:
నేడు ఎంపీసీ పాలసీ నిర్ణయాల ప్రకటన సమయంలో రిజర్వు బ్యాంక్ గవర్నల్ ఈ ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాను గతంలో ప్రకటించిన 6.7 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ఇదే క్రమంలో త్రైమాసికాల వారీగా అంచనాలను గమనిస్తే..
- మొదటి త్రైమాసికం: 6.7% నుంచి 6.5%కి తగ్గించారు
- రెండవ త్రైమాసికం: 7% నుంచి 6.7%కి తగ్గించారు
- మూడవ త్రైమాసికం: 6.5% నుంచి 6.6%కి పెంచారు
- నాల్గవ త్రైమాసికం: 6.5% నుంచి 6.3%కి తగ్గించారు
కొత్త ఆర్థిక సంవత్సరంలో మెుదటి సారి రిజర్వు బ్యాంక్ సమావేశం నిర్వహిస్తుండగా.. సంజయ్ మల్హోత్రా రిజర్వు బ్యాంక్ గవర్నర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది రెండవ సమావేశం కావటం గమనార్హం. మల్హోత్రా తన మెుదటి సమావేశంలో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గింపును ప్రకటించారు. ప్రపంచ సెంట్రల్ బ్యాంకులకు భిన్నంగా గత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ రేట్ల తగ్గింపును సాగతీతతో దేశంలో వినియోగం పడిపోయి వృద్ధి రేటు కనిష్ఠాలకు పడిపోయిన వేళ ఆయనను కేంద్ర ప్రభుత్వం పక్కకు తప్పించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఫిబ్రవరి ఎంపీసీ సమావేశంలో రిజర్వు బ్యాంక్ కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించి 6.25 శాతం వద్ద కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో 2020 మే నెల తర్వాత తొలిసారిగా వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటించబడింది. అంటే ఆర్బీఐ దాదాపు 30 నెలల పాటు రెపో రేట్లలో ఎలాంటి మార్పులూ లేకుండా కొనసాగించింది.
ఆర్థిక నిపుణుల అంచనాలు ఇలా..
2025 ప్రారంభం నుంచి రిజర్వు బ్యాంక్ రెండు సార్లు వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మరో రెండుసార్లు ఈ ఏడాది రేట్ల తగ్గింపు ప్రకటన ఉండొచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎకనమిక్ రీసెర్చ్ డెవల్ప్మెంట్ రిపోర్టులో వెల్లడించింది. జూలైలోపు ఒకసారి, ఆగస్టు తర్వాత రెండోసారి ఈ ఏడాది వడ్డీ రేట్లను 100 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించే అవకాశం ఉందని ఎస్బీఐ రిపోర్ట్ పేర్కొంది.