- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరింత తగ్గుతాయి
- బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల క్యాపిటల్ మెరుగుపడింది
- ఆర్‌బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్
న్యూఢిల్లీ: మనదేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, బ్యాంకింగ్ సిస్టమ్ నిలకడగా ఉందని ఆర్‌బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ (ఎఫ్‌ఎస్‌ఆర్) పేర్కొంది. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (జీఎన్‌పీఏ) రేషియో (మొత్తం అప్పుల్లో జీఎన్‌పీఏల వాటా) ఈ ఏడాది మార్చి నాటికి 12 ఏళ్ల కనిష్టమైన 2.8 శాతానికి తగ్గిందని వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 2.5 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. నెట్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్‌ఎన్‌పీఏ) రేషియో 0.6 శాతానికి దిగొచ్చిందని పేర్కొంది. కిందటి ఆర్థిక సంవత్సరంలోని చివరి ఆరు నెలల్లో ప్రభుత్వ బ్యాంకుల గ్రాస్ ఎన్‌పీఏల రేషియో 0.76 శాతం తగ్గిందని తెలిపింది.
బ్యాంకుల బ్యాలెన్స్‌షీట్ మెరుగుపడుతోందని, ఫైనాన్షియల్ సంస్థలు ఇస్తున్న అప్పులు పెరుగుతున్నాయని ఆర్‌బీఐ ఎఫ్‌ఎస్‌ఆర్ పేర్కొంది. బ్యాంకుల క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ రేషియో (సీఆర్‌ఏఆర్– క్యాపిటల్ అడెక్వసీ రేషియో) 16.8 శాతంగా ఉందని, కామన్ ఈక్విటీ టైర్ 1 (సీఈటీ1) రేషియో 13.9 శాతంగా ఉందని ఎఫ్‌ఎస్‌ఆర్ వివరించింది. ఎన్‌పీఏలుగా మారే అసెట్స్‌తో బ్యాంకుల దగ్గరున్న క్యాపిటల్‌ను పోల్చడానికి సీఆర్‌ఏఆర్ సాయపడుతుంది.
బ్యాంకుల ఆస్తులను వీటి క్యాపిటల్‌తో పోల్చడానికి సీఈటీ1 రేషియో సాయపడుతుంది. ఆర్‌బీఐ పెట్టుకున్న సీఆర్‌ఏఆర్ టార్గెట్స్‌ను వచ్చే ఏడాది మార్చి నాటికి చేరుకుంటామని ఎఫ్‌ఎస్‌ఆర్ వెల్లడించింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) ఆర్థిక పరిస్థితులు మెరుగవుతున్నాయని, వీటి సీఆర్‌ఏఆర్ ఈ ఏడాది మార్చి నాటికి 26.6 శాతంగా, జీఎన్‌పీఏ రేషియో 4.0 శాతంగా ఉన్నాయని వివరించింది. గ్లోబల్‌గా సమస్యలు ఉండడంతో రిస్క్‌లు లేకపోలేదని ఆర్‌బీఐ ఎఫ్‌ఎస్‌ఆర్ రిపోర్ట్ పేర్కొంది. అయినప్పటికీ గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ నిలకడగా ఉందని తెలిపింది.
సెక్యూరిటీపై ఫోకస్ పెట్టండి: దాస్
ఫైనాన్షియల్ సిస్టమ్‌ను కొత్త టెక్నాలజీలు ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాంకింగ్ సిస్టమ్‌లో స్టెబిలిటీ ఉందని, కానీ ఇక్కడి నుంచి ఈ వ్యవస్థ మెరుగుపడాలంటే అంత ఈజీ కాదని అన్నారు. కొత్త టెక్నాలజీలతో కస్టమర్ల ఎక్స్‌పీరియెన్స్ మెరుగుపడుతుందని, అలానే ఫైనాన్షియల్ సిస్టమ్‌లో ఇవి వేగంగా విస్తరించడం వలన సమస్యలు కూడా నెలకొంటాయని అన్నారు. బ్యాంకులు, సంస్థలు, ఇతర స్టేక్‌హోల్డర్లు టెక్నాలజీని సరిగ్గా వాడుకోవడానికి సరిపడినంత ఇన్వెస్ట్ చేయాలని, సెక్యూరిటీని బలపరుచుకోవాలని సూచించారు.