ఆర్బీఐ మానిటరీ పాలసీ ప్రకటన
గరిష్ట స్థాయిల్లో ఇన్‌ఫ్లేషన్
ఈ క్వార్టర్‌లో పాజిటివ్ గ్రోత్ ఉండొచ్చు
అవసరమైన లిక్విడిటీ అందుబాటులో ఉంచుతాం
ఆర్బీఐ గవర్నర్ దాస్ వెల్లడి
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వరుసగా మూడో సారి కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటడంతో.. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. దీంతో కీలక వడ్డీ రేట్లు రెపో 4 శాతంగా, రివర్స్ రెపో 3.35 శాతంగా ఉన్నాయి. ఎకానమీ అంచనావేసిన దానికంటే వేగంగా కోలుకుంటుందని, ప్రస్తుత క్వార్టర్‌లో జీడీపీ పాజిటివ్ గ్రోత్‌ను రికార్డు చేస్తుందని మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) ఆశాభావం వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలున్నాయని కూడా సిగ్నల్స్ ఇచ్చింది. బుధవారం ప్రారంభమైన ఎంపీసీ మీటింగ్ శుక్రవారంతో ముగిసింది. ఈ ఏడాది ఎంపీసీ కమిటీ కీలక వడ్డీరేట్లను115 పాయింట్ల మేర తగ్గించింది. అయితే ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో వడ్డీ రేట్ల తగ్గింపుకు ఆర్‌బీఐ కాస్త బ్రేకిచ్చింది. వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు ఉండవని ముందస్తుగానే మార్కెట్, ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ భావించారు. వీరి అంచనాలకు తగ్గట్టే పాలసీ ప్రకటన వచ్చింది.
అక్టోబర్ నెలలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ 2014 మార్చి నాటి గరిష్ట స్థాయిలకు అంటే 7.61 శాతానికి ఎగిసింది. ఆర్‌బీఐ టార్గెట్‌గా పెట్టుకున్న ఇన్‌ఫ్లేషన్ 2 నుంచి 6 శాతం మధ్యలోనే ఉండాలి. 2020–21 మూడో క్వార్టర్‌లో ఈ రిటైల్ ఇన్‌ఫ్లేషన్ 6.8 శాతంగా, నాలుగో క్వార్టర్‌లో 5.8 శాతంగా ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనావేసింది. ప్యాసెంజర్ వెహికల్స్, మోటార్‌సైకిల్ సేల్స్‌లో డబుల్ డిజిట్ గ్రోత్, రైల్వే ఫ్రయిట్ ట్రాఫిక్, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ పెరగడం వంటివి ఎకానమీ వేగంగా కోలుకుంటుందనే దానికి సంకేతాలుగా ఉన్నాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు. అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్‌లో జీడీపీ 0.1 శాతం గ్రోత్‌ను, ఆ తర్వాత మూడు నెలల కాలంలో 0.7 శాతం గ్రోత్‌ను రికార్డు చేస్తుందని పేర్కొన్నారు. మొత్తంగా 2020–21 ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఎకానమీ –7.5 డీగ్రోత్‌నే రికార్డు చేస్తుందన్నారు. కరోనా దెబ్బకు ఏప్రిల్–జూన్ క్వార్టర్‌లో ఎకానమీ 23.9 శాతం పడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఎకానమీ కోలుకుంటోంది. ఇన్‌ఫ్లేషన్ ఇంకా కొండెక్కే కూర్చుందని, గ్రోత్‌కు సపోర్ట్ ఇచ్చేందుకు ఇది అడ్డు తగులుతుందని దాస్ పేర్కొన్నారు. అయితే సిస్టమ్‌లో అవసరమైన లిక్విడిటీ అందించేందుకు ఆర్‌బీఐ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు.
వడ్డీరేట్లను మార్చకపోవడంతో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఇన్వెస్టర్లకు ఇది గుడ్‌న్యూస్‌గా నిలిచింది. బ్యాంక్‌లు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండదు. కరోనా టైమ్‌లో ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను తగ్గించడంతో చాలా బ్యాంక్‌ల ఎఫ్‌డీ రేట్లు పడిపోయాయి. ఎస్‌బీఐ వన్ ఇయర్ ఎఫ్‌డీ రేటు 2019 డిసెంబర్‌లో 6.25 శాతంగా ఉంటే.. ప్రస్తుతం 4.90 శాతానికి పడిపోయింది. ఎఫ్‌డీల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకున్న ఇన్వెస్టర్లు ఎక్కువ రిటర్న్‌ల కోసం ఆల్టర్నేటివ్ ఆప్షన్లను వెతుకుతున్నారు. వడ్డీరేట్లను మార్చకపోవడంతో ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ రేటుతో లింక్ అయిన లోన్లకు బారోవర్స్ ఎంతైతే ఈఎంఐ చెల్లిస్తున్నారో అంతే చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాంక్ మీ లోన్ అకౌంట్‌పై రిస్క్ ప్రీమియం పెంచితే.. లోన్ ఈఎంఐ పెరుగుతుంది. ఎంసీఎల్‌ఆర్‌తో లింక్ అయిన హోమ్ లోన్స్ విషయంలో అయితే బ్యాంక్‌లు రీసెట్ చేసే కాల వ్యవధి ప్రకారం ఈఎంఐ ఉంటుంది.
టెక్నాలజీపై ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి..
కరోనా టైమ్‌లో డిజిటల్ పేమెంట్స్ బాగా పెరగడం, దాంతో పాటు తలెత్తిన ఫెయిల్యూర్స్, ఫ్రాడ్స్ కోసం ఆర్‌బీఐ డిజిటల్ పేమెంట్ సెక్యూరిటీ కంట్రోల్ రూల్స్‌ను జారీ చేసింది. ఈ రూల్స్ నెట్‌బ్యాంకింగ్ ట్రాన్స్‌ఫర్స్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, కార్డు పేమెంట్స్ వంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను సెక్యూర్‌గా చేసుకునేందుకు, ఫెయిల్యూర్స్‌ను, ఫ్రాడ్స్‌ను తగ్గించేందుకు సాయం చేయనున్నాయి. డిజిటల్ బ్యాంకింగ్‌పై కస్టమర్లలో ఉన్న కాన్ఫిడెన్స్ దెబ్బతీయకుండా ఉండేందుకే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై తాము చర్యలు తీసుకున్నామని దాస్ అన్నారు. టెక్నాలజీ విభాగంపై బ్యాంక్‌లు ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలని సూచించారు. ఎస్‌బీఐ యోనో యాప్‌లో నెలకొన్న టెక్నాలజీ సమస్యపై కూడా స్టడీ చేస్తున్నామని తెలిపారు. గత రెండేళ్ల నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సర్వీసుల్లో పలు అంతరాయాలు వస్తుండటంతో కొత్త క్రెడిట్ కార్డుల జారీని, కొత్త డిజిటల్ బిజినెస్ ప్రొడక్ట్‌ల లాంచ్‌ను ఆర్‌బీఐ ఆపివేసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన డిజిటల్ సర్వీసులను మరింత విస్తరించే ముందు, ఐటీ సిస్టమ్స్‌ను మరింత బలంగా మార్చుకోవాలని దాస్ సూచించారు.
ఎల్లవేళలా ఆర్‌టీజీఎస్ సర్వీసులు..
ఈ నెల 14 నుంచి ఆర్‌టీజీఎస్(రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్) సర్వీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయని దాస్ చెప్పారు. ప్రస్తుతం ఆర్‌టీజీఎస్ అన్ని వర్కింగ్ డేస్‌లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటున్నాయి. గతేడాది డిసెంబర్ నుంచే నెఫ్ట్ సిస్టమ్ 24x7x365 అందుబాటులోకి వచ్చింది.
ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలే..
కార్పొరేట్ దిగ్గజాలకు బ్యాంక్ లైసెన్స్ ఇవ్వడంపై వ్యక్తం అవుతోన్న ఆందోళనలను దాస్ కాస్త తగ్గించారు. ఇప్పటి వరకు బ్యాంకింగ్ లైసెన్స్‌లపై, ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ ఇచ్చిన రికమండేషన్లపై ఆర్‌బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్‌లో ఉందని, స్టేక్‌హోల్డర్స్ రెస్పాన్స్‌ల కోసం ఆర్‌బీఐ వేచిచూస్తుందన్నారు.
లాభాలు కాపాడుకోండి..
కరోనా మహమ్మారితో ఎకానమీ దెబ్బతినడంతో.. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, కో ఆపరేటివ్ బ్యాంక్‌లు ఈ ఆర్థిక సంవత్సరం ఎలాంటి డివిడెండ్ పేమెంట్లు జరుపవద్దని ఆర్‌బీఐ ఆదేశించింది. బ్యాంక్‌లు లాభాలను కాపాడుకోవాలని సూచించింది. ఈ మేరకు త్వరలోనే గైడ్‌లైన్స్ జారీ చేస్తామని తెలిపింది. డిపాజిటర్ల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని యెస్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ల బాండ్లను, షేర్లను రైటాఫ్ చేసినట్టు దాస్ ప్రకటించారు.
కాంటాక్ట్‌లెస్ కార్డు ట్రాన్సాక్షన్స్ లిమిట్ పెంపు
సేఫ్‌గా, సెక్యూర్‌గా డిజిటల్ పేమెంట్లు చేసుకునేందుకు ఆర్‌బీఐ కాంటాక్ట్‌లెస్ కార్డు ట్రాన్సాక్షన్స్ పరిమితిని రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పెంచిందని దాస్ చెప్పారు. 2021 జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. కాంటాక్ట్ లెస్ కార్డు పేమెంట్ల పరిమితిని పెంచడంపై బ్యాంకింగ్ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ ఎకోసిస్టమ్ మరింత పెరుగుతుందని ఎస్‌బీఐ కార్డు సీఈవో, ఎండీ అశ్విని కుమార్ తివారి అన్నారు. ఈ ప్రకటన రూపే కార్డు హోల్డర్స్‌కు, భీమ్ యూపీఐపై ఉన్న కస్టమర్లకు సాయం చేయనుందని ఎన్‌పీసీఐ ఎండీ, సీఈవో దిలీప్ ఆస్బే చెప్పారు.
For More News..