- అన్ని ఏటీఎంలు, బ్యాంకుల్లో ‘కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రా’ అమలు..
- 11 వ సారీ వడ్డీ రేట్లు మార్చలే..ఇన్‌ఫ్లేషన్ అంచనాలు పెరిగాయి
- వ్యవస్థలో లిక్విడిటీ తగ్గించడంపై ఆర్‌బీఐ ఫోకస్
బిజినెస్ డెస్క్, వెలుగు: డెబిట్ కార్టు లేకుండానే ఏటీఎంల నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని ఆర్‌బీఐ కలిపించనుంది. యూపీఐ ద్వారా ఏటీఎంలు, బ్యాంక్‌ల నుంచి విత్‌డ్రా చేసుకునే ఫెసిలిటీని అన్ని బ్యాంకుల్లో తీసుకొస్తామని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు మాత్రమే కార్డులెస్ విత్‌డ్రా ఫెసిలిటీని ఆఫర్ చేస్తున్నాయి. ప్రతీ రెండు నెలలకొకసారి జరిగే ఎంపీసీ మీటింగ్ వివరాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ‘కార్డ్‌లెస్ విత్‌డ్రాలతో స్కిమ్మింగ్ (కార్డును దొంగతనంగా స్కాన్ చేయడం), కార్డ్ క్లోనింగ్ (ఫేక్ కార్డులు), డివైస్‌లను ట్యాంపరింగ్ చేయడం వంటి మోసాలకు తావుండదు. కస్టమర్లు యూపీఐ ద్వారా కార్డులెస్ విత్‌డ్రాలను చేపట్టొచ్చు. సెటిల్‌మెంట్స్ ఏటీఎం నెట్‌వర్క్ ద్వారా జరుగుతాయి’ అని ఆయన పేర్కొన్నారు.ఈ విధానంలో ఏ ఏటీఎం నుంచైనా డెబిట్‌కార్డును ఉపయోగించి కనీసం రూ. 100 ను గరిష్టంగా ఒకరోజులో రూ. 10 వేలను విత్‌డ్రా చేసుకోవడానికి వీలుంటుంది. ఒక నెలలో గరిష్టంగా రూ. 25 వేలు విత్‌డ్రా చేసుకోవచ్చని ఆర్‌బీఓ ప్రకటించింది.
హౌసింగ్ లోన్ ఎక్కువగా..
ఇండివిడ్యువల్ హౌసింగ్ లోన్ల కింద ఎక్కువ అప్పును పొందేందుకు కొవిడ్ టైమ్‌లో తెచ్చిన రూల్స్‌ను వచ్చే ఏడాది వరకు కొనసాగిస్తామని ఆర్‌బీఐ ప్రకటించింది. హౌస్ వాల్యూలో లోన్ (ఎల్‌టీవీ) ని బట్టి లోన్ రిస్క్‌ను నిర్ణయించే రూల్స్‌ను 2020, అక్టోబర్‌లో ఆర్‌బీఐ తెచ్చిన విషయం తెలిసిందే. ఈ రూల్స్‌ను బట్టి ఎల్‌టీవీ రేషియో 80 శాతం లేదా అంతకంటే తక్కువ ఉంటే ఆ లోన్ రిస్క్ వెయిట్‌ను 35 శాతంగా లెక్కిస్తారు. అదే ఎల్‌టీవీ 80 నుంచి 90 శాతం మధ్య ఉంటే రిస్క్ వెయిట్ 50 శాతంగా లెక్కిస్తారు. ఈ రూల్స్‌ను వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.
ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది..
ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ 5.7 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనావేసింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా క్రూడాయిల్, స్టీల్, అల్యూమినియం వంటి కమోడిటీల రేట్లు బాగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో ఈ సారి పంటల దిగుబడి బాగుంటుందనే అంచనాలు ఉన్నప్పటికీ, ఆర్‌బీఐ తన ఇన్‌ఫ్లేషన్ టార్గెట్‌ను పెంచింది. ఇన్‌ఫ్లేషన్ క్యూ1 లో 6.3 శాతంగా, క్యూ2లో 5 శాతంగా, క్యూ3 లో 5.4 శాతంగా, క్యూ4 లో 5.1 శాతంగా ఉంటుందని అంచనావేసింది. ఓవరాల్‌గా 2022–23 ఆర్థిక సంవత్సరంలో దేశంలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ 5.7 శాతంగా ఉంటుందని శక్తి కాంత దాస్ పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎంపీసీ మీటింగ్‌లో 2022–23 లో ఇన్‌ఫ్లేషన్ 4.5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనావేసింది. తాజాగా ఈ అంచనాలను సవరించింది.
జీడీపీ గ్రోత్ తగ్గుద్ది!
వరసగా 11 వ ఎంపీసీ మీటింగ్‌లోనూ కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ మార్చలేదు. రెపో రేటు (బ్యాంక్‌లు ఆర్‌బీఐకి చెల్లించే వడ్డీ) ని, రివర్స్ రెపో రేటు (ఆర్‌బీఐ బ్యాంకులకు చెల్లించే వడ్డీ) ను ఎప్పటిలానే కొనసాగించింది. ప్రస్తుతం రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా, రెపో రేటు 4 శాతంగా ఉన్నాయి. ఈ సారి నుంచి గ్రోత్ కంటే ఇన్‌ఫ్లేషన్‌ను కంట్రోల్ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని దాస్ అన్నారు. ఆర్‌బీఐ వైఖరి గతంలో ఉన్నంత సరళంగా ఉండదన్నారు. 2022–23 లో జీడీపీ గ్రోత్ అంచనాలను 7.8 % నుంచి 7.2 శాతానికి ఆర్‌బీఐ తగ్గించింది. క్యూ1 లో జీడీపీ గ్రోత్ రేటు 16.2 శాతంగా, క్యూ2లో 6.2 శాతంగా, క్యూ3 లో 4.1 శాతంగా, క్యూ4 లో 4 శాతంగా ఉంటుందని అంచనావేసింది.