
- 2024–25 లో 57.5 టన్నుల కొనుగోళ్లు
- ఆర్థిక వ్యవస్థకు దన్నుగా బంగారం
- 2017 నుంచి పెరిగిన కొనుగోళ్లు
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పెద్ద మొత్తంలో గోల్డ్‌ను కొనుగోలు చేస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 57.5 టన్నుల బంగారాన్ని సేకరించింది. గ్లోబల్‌గా ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడంతో ఇన్‌ఫ్లేషన్‌ను ఎదుర్కొనేందుకు గోల్డ్ నిల్వలను పెంచుకుంటోంది. డిసెంబర్ 2017 నుంచి పెద్ద మొత్తంలో గోల్డ్‌ను కొనడం ప్రారంభించింది. అప్పటి నుంచి చూస్తే కిందటి ఆర్థిక సంవత్సరంలో చేసిన కొనుగోళ్లు రెండో అత్యధికం కావడం విశేషం. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, యూఎస్ డాలర్ హెచ్చుతగ్గులు, యూఎస్ ప్రభుత్వ బాండ్లపై ఆందోళనల మధ్య రిస్క్‌లను తగ్గించడానికి గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు తమ బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి.
మిగిలిన దేశాల సెంట్రల్ బ్యాంకుల మాదిరే ఆర్‌బీఐ కూడా గోల్డ్ నిల్వలను పెంచుకుంటోంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆర్‌బీఐ వద్ద బంగారం నిల్వలు 879.6 టన్నులకు చేరుకున్నాయి. 2021–-22లో అత్యధికంగా 66 టన్నులు, ఆ తర్వాత 2022–23లో 35 టన్నులు, 2023–24లో 27 టన్నుల బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ కొనుగోలు చేసింది.
ట్రంప్ వచ్చాక గోల్డ్‌పై పెరిగిన మక్కువ
యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కిందటేడాది నవంబర్‌లో అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి గోల్డ్‌కు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. డాలర్ వాల్యూలో తీవ్ర హెచ్చుతగ్గులు నెలకొనడడంతో బంగారం వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారు. సెంట్రల్ బ్యాంకులు తమ నిల్వలను డైవర్షిఫై చేసుకోవడానికి గోల్డ్ కొనుగోళ్లు పెంచాయి. ఆర్థిక అనిశ్చితులకు వ్యతిరేకంగా హెడ్జ్‌గా దీనిని వాడుతున్నాయి. “అన్ని గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు యూఎస్ ట్రెజరీలపై ఆధారపడటాన్ని తగ్గించి, బంగారం నిల్వలను బలోపేతం చేస్తున్నాయి” అని నువామా ఎనలిస్ట్ సజల్ గుప్తా చెప్పారు.
భారతదేశ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా పెరుగుతోంది. ఈ నెల 11 నాటికి ఫారెక్స్ నిల్వల్లో వీటి వాటా 11.8 శాతానికి చేరుకుంది. కిందటేడాది ఏప్రిల్లో ఇది 8.7 శాతంగా ఉంది. ఈ టైమ్‌లో గోల్డ్ ధరలు 30 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. ఫలితంగా ఆర్‌బీఐ దగ్గరున్న గోల్డ్ విలువ భారీగా పెరిగింది. గ్లోబల్‌గా ఎక్కువ గోల్డ్ నిల్వలున్న టాప్ 10 సెంట్రల్ బ్యాంకుల్లో ఆర్‌బీఐ ఒకటి. టర్కీ, స్విట్జర్లాండ్ , చైనా మాదిరిగా కాకుండా, ఆర్‌బీఐ రాజకీయ పరిస్థితుల కారణంగా బంగారాన్ని అమ్మడం లేదు.
కిందటేడాది డిసెంబర్ నాటికి వివిధ దేశాల దగ్గరున్న గోల్డ్ నిల్వలు..
దేశం గోల్డ్ (టన్నుల్లో)
యూఎస్ 8,133.46
జర్మనీ 3,351.53
ఇటలీ 2,451.84
ఫ్రాన్స్ 2,436.94
చైనా 2,264.32
స్విట్జర్లాండ్ 1,040.00
భారతదేశం 853.63
జపాన్ 846.00
నెదర్లాండ్స్ 612.45
పోలాండ్ 426.27
సోర్స్: వరల్డ్ గోల్డ్ కౌన్సిల్
గమనిక: రష్యా వద్ద 2,322 టన్నులు ఉంటాయని అంచనా.