మా డబ్బు, డిపాజిట్లు వెనక్కి ఇవ్వండి.. బ్యాంకుకు పోటెత్తిన ఖాతాదారులు

మా డబ్బు, డిపాజిట్లు వెనక్కి ఇవ్వండి.. బ్యాంకుకు పోటెత్తిన ఖాతాదారులు

న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంకుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆంక్షలు ఖాతాదారుల్లో ఆందోళన రేకెత్తించాయి. డబ్బు తిరిగి రాదేమో అన్న భయంతో కస్టమర్లు పెద్ద సంఖ్యలో బ్యాంకు వద్దకు చేరుకుని తమ డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలని నినాదాలు చేశారు. దాంతో, బ్యాంకు వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. ఖాతాదారులకు సర్దిచెప్పలేక అధికారులు, కంట్రోల్ చేయలేక పోలీసులు తలలు పట్టుకున్నారు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే..?

ముంబై బాంద్రాలోని న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంకులో రూ. 122 కోట్ల మోసం జరిగిందన్నది అసలు విషయం. 2022- 25 మధ్య మాజీ జనరల్ మేనేజర్ హితేష్ మెహతా పదవీకాలంలో దాదర్, గోరేగావ్ శాఖల్లో రూ. 122 కోట్లు అవకతవకలు జరిగాయని బ్యాంక్ ప్రతినిధి ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగానికి (EOW) ఫిర్యాదు చేశారు. దాంతో, ముంబై ఆర్థిక నేరాల విభాగం జరిగిన అవకతవకలపై దర్యాప్తు ప్రారంభించింది. హితేష్ మెహతా రెండు శాఖల ఖాతాల నుండి రూ.122 కోట్లు దుర్వినియోగం చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

కేసు దర్యాప్తు ప్రారంభ దశలో ఉండటంతో న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంకు లావాదేవీలపై ఆర్బీఐ 6 నెలల పాటు ఆంక్షలు విధించింది. ఆర్బీఐ ముందస్తు అనుమతి లేకుండా ఫిబ్రవరి 13 నుంచి రుణాలు మంజూరు, పెట్టుబడులు, కొత్త డిపాజిట్లు స్వీకరించడం వంటివి చేయరాదని స్పష్టం చేసింది. నగదు ఉపసంహరణలపైనా పరిమితులు విధించింది.

ఈ విషయం ఖాతాదారులకు తెలియడంతో బ్యాంకు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తమ డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతో, బ్యాంకు వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. చివరకు అధికారులు ఆర్బీఐ ఆంక్షలు తాత్కాలికమేనని, 90 రోజుల్లోపు డిపాజిట్లు తిరిగి చెల్లిస్తామని డిపాజిటర్లకు హామీఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.