
న్యూఢిల్లీ: ఈ ఏడాది మే 1 నుంచి ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేయాలంటే రూ. 23 ఫీజు చెల్లించాల్సిందే. ఫ్రీ విత్‌డ్రాలు అయిపోయాక ఒక్కో లావాదేవికి రూ.23 ఛార్జీ వసూలు చేసేందుకు బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది. గతంలో ఒక్కో లావాదేవీకి రూ. 21 రుసుము వసులు చేసేవారు. ఖాతాదారులు తమ సొంత బ్యాంక్ ఏటీఎం నుంచి ప్రతి నెలా ఐదు ఉచిత లావాదేవీలు (ఆర్థిక, ఆర్థికేతర రెండూ) చేసుకోవడానికి అర్హులు. అలాగే, ఇతర బ్యాంకుల ఏటీఎంల వద్ద కూడా మెట్రోల్లో అయితే మూడు ఉచిత లావాదేవీలు చేయొచ్చు. మెట్రో కాని ప్రాంతాల్లో ఐదు వరకు ఉచిత లావాదేవీలు చేయొచ్చు.
ఏటీఎం విత్‌డ్రాల ఇంటర్‌చేంజ్ ఫీజును రూ. 2 పెంచడానికి ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది. కాగా, ఏటీఎం విత్‌డ్రాలపై రూ.19 ఇంటర్‌చేంజ్ ఫీజును, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం వంటి ఆర్థికేతర లావాదేవీలపై రూ.7 ఫీజును వసూలు చేయాలని నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ స్టీరింగ్ కమిటీ సిఫార్సు చేసింది. వీటిపై అదనంగా జీఎస్‌టీ పడుతుంది. దీంతో మొత్తం ఫీజు రూ.23 కి పెరుగుతుంది.