యూపీఐ పేమెంట్​ లిమిట్ .. ​రూ.5 లక్షలకు 

యూపీఐ పేమెంట్​ లిమిట్ .. ​రూ.5 లక్షలకు 
  • డెలిగేటెడ్ పేమెంట్స్ కూడా.. గంటల్లోనే చెక్కుల క్లియరెన్స్​

ముంబై: యూపీఐ వాడకాన్ని ప్రోత్సహించేందుకు  ఈ విధానంలో పేమెంట్ లిమిట్​ను ​రూ.లక్ష నుంచి రూ.ఐదు లక్షలకు పెంచుతున్నట్టు  ఆర్‌‌బీఐ ప్రకటించింది. దీంతో ఇక నుంచి ఫోన్‌ పే, గూగుల్ పే వంటి పేమెంట్ యాప్‌లతో ఎవరికైనా రూ. ఐదు లక్షల వరకు పంపుకోవచ్చు.  ఐపీఓ వంటి వాటికి కూడా  రూ.ఐదు లక్షల వరకు యూపీఐతో చెల్లించడానికి ఆర్‌‌బీఐ అనుమతి ఇచ్చింది.

ఇది వరకే హాస్పిటల్ ​బిల్స్​ వంటి చెల్లింపులకు రూ.ఐదు లక్షల దాకా డబ్బు కట్టే వీలుంది. నిరంతర  చెక్ క్లియరింగ్‌ను ప్రవేశపెట్టాలని కూడా ఆర్​బీఐ ప్రతిపాదించింది. కొన్ని గంటల్లోనే చెక్కులు క్లియర్​ అయ్యేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్ తెలిపారు.

యూపీఐలో "డెలిగేటెడ్ పేమెంట్స్​ను" ప్రవేశపెట్టాలని ఆర్​బీఐ ప్రతిపాదించింది. ఇది ఒక వ్యక్తి మరొక వ్యక్తికి నిర్దేశిత మొత్తం వరకు లావాదేవీని నిర్వహించడానికి ఈ విధానం ద్వారా అనుమతి ఇవ్వవచ్చు.  అంటే తన ఖాతాలోని కొంత మొత్తాన్ని ఇతరులు వాడుకోవచ్చు.

వడ్డీరేట్లు మారలే..

ఎనలిస్టుల అంచనాలు నిజమయ్యాయి. ఆర్​బీఐ ఈసారి కూడా వడ్డీరేట్లను యదాతథంగా ఉంచింది. వరుసగా తొమ్మిదో పాలసీ సమావేశంలోనూ బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లను మార్చలేదు.   ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) రెపో రేటును 6.50 శాతం వద్ద యదాతథంగా ఉంచడానికే మొగ్గుచూపింది.  ఎంపీసీలోని ఆరుగురు సభ్యులలో నలుగురు రేటు పెంచకూడదన్న నిర్ణయానికి అనుకూలంగా ఓటు వేశారు. 

ఎంపీసీ చివరిసారిగా ఫిబ్రవరి 2023లో వడ్డీ రేటును 6.5 శాతానికి పెంచింది.  ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లక్ష్యం వైపు తీసుకువచ్చేలా చేయడానికి "వసతి సడలింపు" విధాన వైఖరిని కొనసాగించాలని ప్యానెల్ నిర్ణయించింది.  జూన్‌లో ద్రవ్యోల్బణం 5.08 శాతానికి ఎగబాకింది. ప్రధానంగా ఆహార పదార్థాల ధరలు 
పెరగడమే ఇందుకు కారణం.  

ముఖ్యాంశాలు..

  •  ఆర్​బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–-25)కి మనదేశ జీడీపీ వృద్ధి అంచనాను 7.2 శాతం వద్ద, సీపీఐ ద్రవ్యోల్బణం అంచనాను 4.5 శాతం వద్ద ఉంచింది.    ద్రవ్యోల్బణం అంచనా ఎటువంటి మార్పు లేకుండా 4.5 శాతంగా ఉండగా, 2026 ఆర్థిక సంవత్సరానికి ఇది 4.4 శాతంగా ఉంది.
  •  గ్లోబల్ ఎకానమీ బాగానే ఉంది.  దేశీయ ఆర్థిక కార్యకలాపాలు దాని ఊపును కొనసాగిస్తూనే ఉన్నాయి.  కరెంట్ ఖాతా లోటు అదుపులోనే ఉంది. ఫారెక్స్ నిల్వలు  675 బిలియన్ డాలర్ల చారిత్రక గరిష్ఠానికి పెరిగాయి.
  • భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్లను గట్టిగా ఎదుర్కొంటోంది.  ఇది బలోపేతమవుతోంది. భారతీయ రూపాయి ఇప్పటి వరకు చాలా వరకు పరిమిత శ్రేణిలో ఉంది. 
  • అనధికార సంస్థలను అడ్డుకోవడానికి డిజిటల్ లెండింగ్ యాప్‌ల పబ్లిక్ రిపాజిటరీని ఏర్పాటు చేయాలని ఆర్​బీఐ నిర్ణయించింది.  బ్యాంకులు టాప్​అప్​ లోన్లు ఇచ్చేటప్పుడు రూల్స్​ పాటించడం లేదని పేర్కొంది.