న్యూఢిల్లీ: ధరల పెరుగుదలను ఆపడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2022 మే నుంచి వరుసగా ఆరుసార్లు రెపోరేట్లను పెంచింది. దీంతో బ్యాంకుల వడ్డీరేట్లు విపరీతంగా పెరిగాయి. ఈసారి మాత్రం కీలక పాలసీ రేట్లను 6.5శాతం వద్ద మార్చకుండా అలాగే ఉంచింది. ఫలితంగా ఇండ్ల కొనుగోలుదారులకు, రియల్టీ డెవలపర్లకు ఎంతో ఉపశమనం కలగనుంది. గత మూడు క్వార్టర్లలో హోంలోన్ వడ్డీ రేట్లలో చాలా పెరుగుదల కనిపించింది. దీంతో బ్యారోవర్ జేబులపై భారం మరింత ఎక్కువయింది. ముఖ్యంగా బడ్జెట్హోమ్లోన్లు తీసుకున్న వారిపై ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా ఉంది. ఈ సెగ్మెంట్ హోంలోన్ రేట్లు 9శాతానికి పైగా పెరిగాయి. ఆర్బీఐ రేట్లు యథాతథంగా ఉంచడం రియల్ ఎస్టేట్ రంగానికి చాలా మేలు చేసింది.
ఈసారి ఆర్బీఐ వడ్డీరేట్లను మరో 25- బేసిస్ పాయింట్లను పెంచుతుందని భావించారు కానీ ఆ అంచనాలు నిజం కాలేదు. దీంతో అటు డెవెలపర్లతోపాటు హోంబయర్లు, బ్యారోవర్లు ఊపిరి పీల్చుకున్నారు. అధిక వడ్డీ కారణంగా ఇప్పటి వరకు హోంలోన్ తీసుకోవడానికి వెనకాడిన వాళ్లు ఇక నుంచి బ్యాంకులకు వెళ్లే అవకాశం ఉంది. ‘‘మరోసారి పాలసీ రేట్లను పెంచితే వడ్డీ రేటు 10శాతం వరకు వెళ్తుంది. ఇది కొనుగోలుదారుల సెంటిమెంట్‌పై, స్థోమతపై, ముఖ్యంగా బడ్జెట్ హౌసింగ్ విభాగంలో విపరీతమైన ప్రభావాన్ని చూపుతుంది" అని సిగ్నేచర్ గ్లోబల్ (ఇండియా) లిమిటెడ్ చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ అన్నారు.
‘‘ ప్రాపర్టీ ధరల పెరుగుదలకుతోడు హోంలోన్ రేట్లు ఎక్కువ అయ్యాయి. రేట్లను పెంపును మార్చకపోవడం వల్ల బడ్జెట్ ఇండ్ల కొనుగోలుదారులకు మేలు జరుగుతుంది. ఈ నిర్ణయం వల్ల హోంలోన్ విభాగం గ్రోత్ బాగుంటుంది. ఈఎంఐలు మారవు. రియల్ ఎస్టేట్ సెక్టార్‌లో కొనుగోలు సెంటిమెంట్‌ను బలోపేతం చేస్తుంది. మిడ్-సెగ్మెంట్ హౌసింగ్ కేటగిరీలో డిమాండ్ పెరుగుదలకు దారితీయవచ్చు’’అని షాపూర్జీ పల్లోంజీ రియల్ ఎస్టేట్ సీఈఓ వెంకటేష్ గోపాలకృష్ణన్ అన్నారు.
బడ్జెట్ హౌసింగ్‌పై ఎఫెక్ట్ ఎక్కువే
వడ్డీభారం కారణంగా రూ.40 లక్షల కంటే తక్కువ ధర ఉన్న హౌసింగ్ యూనిట్ల అమ్మకాలు 2019– 2022తోపాటు 2023 మార్చి క్వార్టర్లో తగ్గాయి. 2019లో, టాప్ ఏడు నగరాల్లో దాదాపు 2,61,400 యూనిట్లు అమ్ముడవగా, దాదాపు 38 శాతం యూనిట్లు బడ్జెట్ సెగ్మెంట్లో ఉన్నాయి. 2022లో, మొత్తం 3,64,880 యూనిట్లు అమ్ముడవగా, కేవలం 26శాతం మాత్రమే బడ్జెట్ కేటగిరీలో ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో, టాప్ ఏడు నగరాల్లో విక్రయించిన మొత్తం 1.14 లక్షల యూనిట్లలో, బడ్జెట్ ఇండ్లు కేవలం 20శాతమే ( 23,110 యూనిట్లు) ఉన్నాయి. కరోనా ఎఫెక్ట్ తొలగిన తర్వాత రియల్ ఎస్టేట్ పుంజుకుంది. డెవలపర్లు లగ్జరీ ప్రాజెక్ట్‌లపై ఎక్కువగా దృష్టి సారించారు. బడ్జెట్ ఇండ్ల కొనుగోలుదారులకు తక్కువ చాయిస్లే మిగిలాయి. దీంతో ఎక్కువ ధరలు పెట్టి ఇండ్లు కొనాల్సి వచ్చింది.
ఎక్కువ అప్పుతోపాటు భారీ వడ్డీనీ భరించాల్సి వస్తోంది. పెద్ద కార్పొరేట్లు భారీగా ఉద్యోగులను తొలగించడం, పెరుగుతున్న ప్రాపర్టీ ధరల కారణంగా తంటాలు పడుతున్న రెసిడెన్షియల్ మార్కెట్‌కు ఆర్బీఐ నిర్ణయం మేలు చేస్తుందని అనరాక్ చైర్మన్ అనుజ్ పూరి చెప్పారు. బడ్జెట్, మిడ్సెగ్మెంట్ల ఇండ్ల కొనుగోలుదారులకు ఉపశమనం కలిగిస్తుందని వివరించారు. రేట్ల నిలుపుదల నిర్ణయం తాత్కాలికం మాత్రమేనని, ఇక నుంచి పెంపులు ఉండొచ్చని ఆర్బీఐ సంకేతాలు పంపింది. అయినప్పటికీ ఈసారి రెపో రేటు పెంపుదలను ఆపడం వల్ల రాబోయే నెలల్లో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకునే అవకాశం ఉంది.