
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశం మనదే
- ఆర్‌బీఐ బ్యాలెన్స్ షీట్ పాకిస్థాన్ జీడీపీ కంటే రెండున్నర రెట్లు ఎక్కువ
- పెరిగిన బ్యాంక్ మోసాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మనదేశ జీడీపీ 7 శాతం వృద్ధి చెందుతుందని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) యాన్యువల్ రిపోర్ట్‌లో పేర్కొంది. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద దేశం మనదేనని తెలిపింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇండియా రియల్ జీడీపీ (ఇన్‌ఫ్లేషన్‌ను పరిగణనలోకి తీసుకొని) గ్రోత్ రేట్ 7.6 శాతానికి పెరిగిందని, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 7 శాతంగా రికార్డయ్యిందని ఆర్‌బీఐ పేర్కొంది. వరుసగా మూడో ఏడాది కూడా రియల్ జీడీపీ గ్రోత్ రేట్ 7 శాతంపైన నమోదయ్యిందని తెలిపింది.
సమస్యలు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్‌గా ఉందని వివరించింది. బ్యాంకులు, కార్పొరేట్‌ల బ్యాలెన్స్‌షీట్‌లు బలంగా ఉండడంతో పాటు, ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌పై ఫోకస్ పెట్టడం, మానిటరీ, రెగ్యులేటరీ, ఫిస్కల్ పాలసీలు మెరుగ్గా ఉండడంతో ఎకానమీ స్ట్రాంగ్ గ్రోత్ నమోదు చేసిందని వెల్లడించింది. ఇన్‌ఫ్లేషన్ దిగొస్తుందని, సప్లయ్ సమస్యలు ఉండడంతో ఆహార పదార్థాల ధరలు పెరగొచ్చని వివరించింది. ఆర్‌బీఐ బ్యాలెన్స్ షీట్ (ఫండ్స్ కేటాయింపులు, అప్పులు, నిల్వలు) సైజ్ ఏడాది మార్చి 31 నాటికి 11.08 శాతం పెరిగి రూ.70.48 లక్షల కోట్ల (సుమారు 845 బిలియన్ డాలర్ల) కు పెరిగింది. ఇది పాకిస్థాన్ మొత్తం జీడీపీ 340 బిలియన్ డాలర్ల కంటే రెండున్నర రెట్లు ఎక్కువ.
2022–23 లో ఆర్‌బీఐ బ్యాలెన్స్ షీట్ సైజ్ రూ.63.44 లక్షల కోట్లుగా రికార్డయ్యింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆర్‌బీఐ బ్యాలెన్స్ షీట్ ఇండియా జీడీపీలో 24.1 శాతంగా ఉంది. ఏడాది కాలంలో 23.5 శాతం నుంచి పెరిగింది. ఆర్‌బీఐ ఇన్‌కమ్ 2023–24 లో ఏడాది ప్రాతిపదికన 17.04 శాతం పెరిగింది. విదేశీ బాండ్ల నుంచి వచ్చే వడ్డీ ఆదాయం కూడా కలుపుకుంటే ఆర్‌బీఐ మిగులు 141.23 శాతం పెరిగి రూ.2.11 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ అమౌంట్‌ను ప్రభుత్వానికి డివిడెండ్‌గా ఇచ్చింది. ఆర్‌బీఐ ఖర్చులు కిందటి ఆర్థిక సంవత్సరంలో ఏడాది ప్రాతిదిపకన 56.3 శాతం తగ్గాయి.
పుంజుకుంటున్న వినియోగం..
కిందటి ఆర్థిక సంవత్సరంలోని ఖరీఫ్, రబీ పంటలకు చేసిన ఖర్చుపై 50 శాతం ఎక్కువ రిటర్న్ రైతులకు అందుతోందని ఆర్‌బీఐ యాన్యువల్ రిపోర్ట్‌లో పేర్కొంది. రిటైల్ ఇన్‌ఫ్లేషన్ దిగొస్తోందని, వినియోగం ముఖ్యంగా గ్రామాల్లో పుంజుకుంటోందని వెల్లడించింది. ఫారెక్స్ నిల్వలు దండిగా ఉండడంతో గ్లోబల్‌గా సమస్యలు ఉన్నప్పటికీ ఏం ఫర్వాలేదని తెలిపింది. జియో పొలిటికల్ టెన్షన్లు, గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్‌లో వోలటాలిటీ, కమొడిటీ ధరల్లో కదలికలు, వాతావరణ మార్పులు వంటి సమస్యలు లేకపోలేదని పేర్కొంది.
అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు@రూ.78,213 కోట్లు
1. బ్యాంకుల నుంచి ఎవరూ తీసుకొని డబ్బు విలువ ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.78,213 కోట్లకు పెరిగింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 26 శాతం ఎక్కువ. డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ దగ్గర రూ.62,225 కోట్లు ఉన్నాయి.
2. బ్యాంకింగ్ సెక్టార్‌లో మోసాలు కిందటి ఆర్థిక సంవత్సరంలో 36,075 కు పెరిగాయి. మోసానికి గురైన అమౌంట్ మాత్రం ఏడాది ప్రాతిపదికన 46.7 శాతం తగ్గి రూ.13,930 కోట్లుగా రికార్డయ్యింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 13,564 ఫ్రాడ్స్ జరగగా, రూ.26,127 కోట్లు మోసానికి గురయ్యాయి.
3. కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ.27,031 కోట్ల (44.34 టన్నుల) విలువైన సావరిన్ గోల్డ్ బాండ్లను ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కంటే ఇది నాలుగు రెట్లు ఎక్కువ. 2015 లో సావరిన్ గోల్డ్ బాండ్లను లాంచ్ చేయగా ఇప్పటి వరకు 67 దశల్లో రూ.72,274 కోట్లను (146.96 టన్నుల విలువైన) సేకరించారు. ఈ టైమ్‌లో 10 గ్రాముల గోల్డ్ ధర రూ.62,300 నుంచి రూ.73,200 కి పెరిగింది.