ఆదాయం పెరిగినా అడ్డగోలు ఖర్చు... గత పదేండ్లలో భారీగా నిధుల దుర్వినియోగం

ఆదాయం పెరిగినా అడ్డగోలు ఖర్చు... గత పదేండ్లలో భారీగా నిధుల దుర్వినియోగం
  • గత పదేండ్లలో భారీగా నిధుల దుర్వినియోగం
  • ఉపయోగం లేని ప్రాజెక్టులకు లక్షల కోట్లు ఖర్చు.. ఆర్బీఐ రిపోర్ట్​ పరిశీలనలో వెల్లడి
  • ప్రజలపై పన్నుల భారం పెంచి రాబడి పెంపు
  • సొంత ఆదాయం సరిపోక ఇబ్బడిముబ్బడిగా అప్పులు
  • ఫలితంగా రూ.56 వేల కోట్లకు చేరిన ద్రవ్యలోటు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్లలో రాష్ట్ర సొంత ఆదాయం గణనీయంగా పెరిగింది. ప్రజలపై పన్నుల భారం మోపి, రాబడి పెంచిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. నిధులను మాత్రం దుర్వినియోగం చేసింది. ఉపయోగం లేని ప్రాజెక్టులపై అడ్డగోలుగా రూ.లక్షల కోట్లు ఖర్చు చేసింది. సొంత ఆదాయం సరిపోక ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసి వాటికే పెట్టింది. ఫలితంగా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోగా, ద్రవ్యలోటు పదేండ్లలో గణనీయంగా పెరిగింది.

ఇటీవల ఆర్బీఐ రిలీజ్ చేసిన గణాంకాలను పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతున్నది. 2014–15 నుంచి 2023–24 మధ్య కాలంలో క్యాపిటల్​ ఎక్స్​పెండిచర్ ​భారీగా చేసినట్టు ఆర్బీఐ పేర్కొన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం, మిషన్​భగీరథ తదితర భారీ ప్రాజెక్టులు చేపట్టింది. కానీ రూ.లక్షల కోట్లు ఖర్చు పెట్టి చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టులు.. ప్రస్తుతం ఉపయోగం లేకుండా పోయాయి. రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.29,288 కోట్ల సొంత ఆదాయం ఉండగా.. అది 2023–24 నాటికి రూ.1.31 లక్షల కోట్లకు పెరిగినట్టు ఆర్బీఐ నివేదికలో వెల్లడించింది. ఇలా పదేండ్లలో రూ.7.08 లక్షల కోట్ల సొంత రాబడిని తెలంగాణ పొందినట్టు తెలిపింది. 

పన్నులు వేసి.. ఆదాయం పెంచి.. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు ప్రజలపై విపరీతంగా పన్నుల భారం మోపింది. ఎక్సైజ్​వ్యాట్, లిక్కర్ ధరలు పెంచి రాబడిని పెంచింది. దీంతో పాటు రిజిస్ర్టేషన్​ చార్జీలు పెంచడం, భూముల విలువలను సవరించడంతో స్టాంప్స్​అండ్​రిజిస్ర్టేషన్స్​ఆదాయం పెరిగింది. పెట్రోల్, డిజీల్​వంటి వాటిపై వ్యాట్​ను గత ప్రభుత్వం పెంచుతూ పోయిందే తప్ప.. ఒక్కసారి కూడా తగ్గించలేదు. ఇది కూడా రాష్ట్ర సొంత ఆదాయం పెరిగేందుకు దోహదపడింది.

ఇలా పదేండ్ల కాలంలో రాష్ట్ర సొంత ఆదాయం బాగానే పెరిగింది. రాష్ట్రం ఏర్పాటైన తొలి ఏడాదిలో రూ.10 వేల కోట్లు పెరిగిన సొంత ఆదాయం.. వరుసగా అదే స్థాయిలో వృద్ధిని నమోదు చేసింది. 2014–15లో రూ.29 వేల కోట్లు ఉండగా.. అది ఐదేండ్లలోనే డబుల్​ను మించి  2018–19లో రూ.65,040 కోట్లకు చేరింది. ఇక 2019–20లో రూ.67,597 కోట్లకు పెరగ్గా, కరోనా సమయంలో 2020–21లో రూ.66,650 కోట్లకు తగ్గింది. మళ్లీ కరోనా నుంచి బయటపడిన తర్వాత 2021–22లో ఆదాయం ఏకంగా రూ.25 వేల కోట్లు పెరిగింది. ఆ తర్వాతి ఏడాది రూ.10 వేల కోట్లు, గత ఏడాదిలో రూ.21 వేల కోట్లు పెరిగి రూ.1.31 లక్షల కోట్లకు చేరింది.

ఆదాయానికి తోడు అప్పులు..  

సొంత ఆదాయం గణనీయంగా పెంచుకున్నప్పటికీ..  గత ప్రభుత్వం అప్పులను అదే స్థాయిలో చేసింది. వందల ఎకరాల ప్రభుత్వ  భూములను అమ్మింది. రాష్ట్ర నికర అప్పులు (గ్యారంటీలు కాకుండా) 2024 మార్చి నాటికి రూ.3,89,673 కోట్లుగా ఉన్నాయి. ఇవి 2015 మార్చి నాటికి రూ.72,658 కోట్లు మాత్రమేనని ఆర్బీఐ వెల్లడించింది. ఇక గ్యారంటీల కింద తెచ్చిన రుణాలు, ఇతరత్రా కలిపితే ఏకంగా అప్పు మొత్తం రూ.6.12 లక్షల కోట్లకు చేరింది. అదే సమయంలో బడ్జెట్​లో పెట్టుకున్న అంచనాలు, అనుకున్న ఖర్చులు లక్ష్యాలను చేరలేదు. వీటన్నింటి ఫలితంగా తెలంగాణ ఏర్పాటైన 2014–15లో రూ.9,410 కోట్లుగా ఉన్న ద్రవ్యలోటు.. 2023–24 నాటికి రూ.56,063 కోట్లకు చేరింది. 

Also Read : సంక్షేమ హాస్టళ్లల్లో పండుగలా కొత్త మెనూ ప్రారంభం

కాళేశ్వరం,​ భగీరథపైనే ఎక్కువ ఖర్చు.. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులపై భారీగా ఖర్చు చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. కాళేశ్వరం కోసం రూ. లక్ష కోట్ల దాకా ఖర్చు చేయగా, మిషన్​భగీరథ కోసం రూ.32 వేల కోట్లు చేసింది. వీటి కోసం అప్పులు చేయడంతో పాటు రాష్ట్ర బడ్జెట్​నుంచి కూడా నిధులు కేటాయించింది. కానీ ఇంత ఖర్చు చేసినప్పటికీ కాళేశ్వరం ఇప్పుడు ఎందుకు ఉపయోగపడని ప్రాజెక్టుగా మారింది. పైగా దానికి సంబంధించిన ఎత్తిపోతల కరెంట్​బిల్లులు ప్రభుత్వానికి గుదిబండగా మారాయి.

అలాగే మిషన్​భగీరథకు వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ, ప్రతి ఇంటికి నల్లా నీళ్లు అందలేదు. ఇక సెక్రటేరియెట్, అమరువీరుల స్థూపం, కమాండ్​కంట్రోల్​సెంటర్​వంటి పెద్ద నిర్మాణాలు చేపట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. వాటి అంచనాలు భారీగా పెంచి డబుల్ ఖర్చు చేసినట్టు తెలుస్తున్నది. రూ.5 వేల కోట్ల అప్పుతో మొదలుపెట్టిన గొర్రెల స్కీమ్ ను సరిగ్గా అమలు చేయలేక మధ్యలోనే చేతులెత్తిసింది. ఇందులో పెద్ద  ఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయి. దళితబంధు స్కీమ్​లోనూ నిధులు దుర్వినియోగమైనట్టు ప్రభుత్వ ఎంక్వైరీలో తేలింది. కొత్త రోడ్లు, ఇతరత్రా వంటి వాటికి కూడా సొమ్ము దుబారా చేసినట్టు తెలిసింది.