అన్‌సెక్యూర్డ్ (సెక్యూరిటీ లేని) లోన్లు ముఖ్యంగా రూ.50 వేల లోపు తీసుకునే చిన్న సైజ్ పర్సనల్ లోన్లు వేగంగా పెరుగుతున్నాయి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఇటువంటి లోన్లు ఇవ్వడాన్ని పెంచాయి కూడా. ఒకవైపు వీటి బిజినెస్ పెరుగుతున్నా మరోవైపు రిస్క్ కూడా లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకులు భారీగా అన్‌సెక్యూర్డ్ లోన్లు ఇస్తుండడంతో ఆర్‌బీఐ తాజాగా కొత్త రూల్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డ్ లోన్లు, కన్జూమర్ లోన్లు వంటి అన్‌సెక్యూర్డ్ లోన్ల కోసం ఇక నుంచి బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు 25 శాతం ఎక్కువ క్యాపిటల్ (రిస్క్ వెయిట్) ను కేటాయించాల్సి ఉంటుంది. ఫలితంగా ఇటువంటి లోన్లు ఇవ్వడంలో ఫైనాన్షియల్ సంస్థల ఖర్చు ఎక్కువవుతుంది. దీంతో అన్‌సెక్యూర్డ్ లోన్లు ఇవ్వడం తగ్గుతుందని, హోమ్, వెహికల్, గోల్డ్ లోన్లు వంటి సెక్యూర్డ్ లోన్లు ఇవ్వడంపై ఫోకస్ పెంచుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రిస్క్ ఎందుకంటే..?
చిన్న సైజ్ లోన్లను ఎక్కువ మంది తీసుకోవడంలో రిస్క్ ఎక్కడుందనే అనుమానం రావొచ్చు. ఇటువంటి లోన్ల వలన వ్యవస్థలో వినియోగం పెరుగుతుందని, కొన్ని సందర్భాల్లో చిన్న వ్యాపారాలకు సాయంగా ఉంటుందని వాదించొచ్చు. కానీ, అన్‌సెక్యూర్డ్ లోన్లు చిన్నవైనా ఇవి పెరిగే కొద్దీ బ్యాంకింగ్ సిస్టమ్‌లో ఒత్తిడి నెలకొంటుందని నిపుణులు పేర్కొన్నారు. ఆర్‌బీఐ రిపోర్ట్ ప్రకారం గత ఏడాది కాలంలో ఫైనాన్షియల్ సంస్థలు ఇచ్చిన అన్‌సెక్యూర్డ్ లోన్లు 23 శాతం వృద్ధి చెందాయి. గత కొన్నేళ్లు గమనిస్తే ఇటువంటి లోన్ల గ్రోత్ సగటున 12–14 శాతంగా ఉంది. ఇదే టైమ్‌లో బ్యాంకులు ఇచ్చిన మొత్తం అప్పులు 15 శాతం మాత్రమే పెరిగాయి. మరోవైపు తక్కువ అప్పు తీసుకున్న చాలా మంది బారోవర్లు తమ రీపేమెంట్లను సకాలంలో చేయడంలో లేదు. ట్రాన్స్‌యూనియన్ సిబిల్ రిపోర్ట్ ప్రకారం, మొత్తం అప్పుల్లో రీపేమెంట్లను సకాలంలో తీర్చని వారి వాటా ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో 5.4 శాతానికి పెరిగింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే 1.2 శాతం ఎక్కువైంది. కానీ, చిన్న సైజ్ పర్సనల్ లోన్లు డీఫాల్ట్ అవుతున్నా వీటి ప్రభావం మొత్తం రిటైల్ పోర్టుఫోలియోపై తక్కువ ఉంటుంది.
మొత్తం బ్యాంక్ ఇండస్ట్రీ రిటైల్ లోన్లలో రూ.50 వేల లోపు ఉన్న పర్సనల్ లోన్ల వాటా కేవలం 0.3 శాతం మాత్రమే ఉంది. అయినప్పటికీ ఇటువంటి లోన్లను జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉందని సిబిల్ వెల్లడించింది. ముఖ్యంగా చాలా మంది బారోవర్లు తమ పర్సనల్ లోన్ల కంటే ఇతర టైప్ లోన్లను తీర్చడానికి ఆసక్తి చూపించే అవకాశం ఎక్కువ ఉంటుందని, అలా జరిగితే ఫైనాన్షియల్ సెక్టార్‌లో ఒత్తిడి పెరుగుతుందని వెల్లడించింది. కాగా, గత నాలుగేళ్లలో రూ.50 వేల లోపు ఉన్న చిన్న సైజ్ పర్సనల్ లోన్లు వేగంగా పెరిగాయి. వాల్యూమ్ పరంగా చూస్తే రిటైల్ లోన్లలో వీటి వాటా 25 శాతానికి పెరిగింది. అదే వాల్యూ పరంగా చూస్తే 2019 లో 3 శాతం ఉన్నది ఈ ఏడాది 8 శాతానికి పెరిగింది.
మొండిబాకీలు తక్కువే..
ఆర్‌బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ కిందటి నెలలో బ్యాంకులకు వార్నింగ్ ఇవ్వడంతో ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా స్మాల్ లోన్ల పోర్టుఫోలి యోని రివ్యూ చేసి, పూర్తి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని బ్యాంకులను ఆదేశించింది. బ్యాంకులు మాత్రం స్మాల్ లోన్ల సంఖ్య పెద్దదైనా, వీటి వాల్యూ మాత్రం తక్కువని చెబుతున్నాయి. స్మాల్ లోన్ సెగ్మెంట్‌లో డీఫాల్ట్‌లు పెరగడం లేదని, చాలా మంది బారోవర్ల క్రెడిట్ స్కోర్ 700 పైన ఉందని ప్రభుత్వ బ్యాంక్ టాప్ అధికారి ఒకరు వెల్లడించారు. కానీ, పర్సనల్ లోన్లు వేగంగా పెరుగుతున్నాయని, ఒత్తిడి పెరగకుండా ఉండేందుకు ఈ సెగ్మెంట్‌ను ఆర్‌బీఐ మానిటర్ చేస్తోందని అన్నారు.
తమ సెక్యూర్డ్ లోన్ బుక్ కంటే అన్‌సెక్యూర్డ్ లోన్ బుక్ బెటర్‌గా ఉందని గతంలో ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ ఖారా అన్నారు. రూ. 50 వేల లోపు ఉన్న లోన్లను ఇవ్వడం తగ్గించామని చెప్పారు. తమ అన్‌సెక్యూర్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో స్ట్రాంగ్‌గా ఉందని, ఎన్‌పీఏలు తక్కువగా ఉన్నాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండీ దేవదత్త చాంద్ అన్నారు. శాలరీ అకౌంట్ అయితేనే కొత్త కస్టమర్లకు పర్సనల్ లోన్లు ఇస్తున్నామని చెప్పారు. తమ లోన్లలో 85 శాతం శాలరీడ్ కస్టమర్లే ఉన్నారని, రీపేమెంట్లు చేయని వారి సంఖ్య కంట్రోల్ చేసే స్థాయిలోనే ఉందని ఐసీఐసీఐ బ్యాంక్ కిందటి నెలలో పేర్కొంది. రూ.50 వేల లోపు ఉన్న లోన్లు తక్కువగా ఇచ్చామని చెప్పింది.