త్వరలోనే ధరలు తగ్గుతయ్​

త్వరలోనే ధరలు తగ్గుతయ్​

న్యూఢిల్లీ: భారతదేశమంతటా రాబోయే నెలల్లో ఇన్​ఫ్లేషన్ (ధరల భారం) తగ్గే అవకాశం ఉందని, హై ఇన్​ఫ్లేషన్ ప్రభావం గరిష్ట స్థాయికి చేరుకుందని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఇన్​ఫ్లేషన్ సమస్య ప్రపంచమంతటా ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌లో భారతదేశంలో ఇన్​ఫ్లేషన్ గరిష్ట స్థాయికి చేరుకుందని, ఇప్పుడు క్రమంగా తగ్గుతున్నదని దాస్ తెలిపారు. ఇన్​ఫ్లేషన్​లో రాబోయే నెలల్లో కొంచెం హెచ్చుతగ్గులు ఉంటాయని, భవిష్యత్తులో ధరలు చాలా వరకు తగ్గుతాయని చెప్పారు. ముడి చమురు,  కమోడిటీ,  ఆహార పదార్థాల ధరలు తగ్గడమే ఇందుకు కారణమని ఆయన వివరించారు. అయితే రాబోయే పాలసీ సమావేశం తర్వాత ప్రకటించే నిర్ణయాలపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) ఆధారిత ఇన్​ఫ్లేషన్  ఈ ఏడాదిలో అత్యధికంగా 7.79 శాతానికి చేరుకుంది. ఈ ఏడాది జూన్‌‌‌‌లో 7.01 శాతంగా ఉన్న సీపీఐ జూలైలో 6.71 శాతానికి పడిపోయింది.  2022 ఏప్రిల్ తర్వాత రిటైల్ ఇన్​ఫ్లేషన్ 7 శాతం స్థాయి కంటే దిగజారడం ఇదే తొలిసారి.

డిజిటల్​ కరెన్సీకి రెడీ అవుతున్నం
డిజిటల్​ రూపాయి తెచ్చేందుకు యూఎస్​ ఫిన్​టెక్​ కంపెనీ ఎఫ్​ఐఎస్​తో మాట్లాడుతున్నామని దాస్​ చెప్పారు. సెంట్రల్​ బ్యాంక్​ డిజిటల్​ కరెన్సీ (సీబీడీసీ) కోసం పైలెట్​ ప్రాజెక్టు నిర్వహించాలని కూడా ప్రభుత్వ బ్యాంకులను కోరామని వెల్లడించారు. ఈ విషయమై తమ సంస్థ ఆర్​బీఐ ఇన్నొవేషన్​ హబ్​తో చర్చిస్తోందని ఎఫ్​ఐఎస్​ సీనియర్​ డైరెక్టర్​ జూలియా దెమీదొవా చెప్పారు. సీబీడీసీ ఆప్షన్లపై ప్రయోగాలు చేసేందుకు తమ కనెక్టెడ్​ ఎకోసిస్టమ్​ను ఉపయోగిస్తామని వెల్లడించారు. సీబీడీసీలను తీసుకొచ్చేందుకు తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్​ బ్యాంకర్లతో రౌండ్​టేబుల్​ కాన్ఫరెన్సులు, వర్క్​షాపులను నిర్వహిస్తున్నదని వెల్లడించారు. సీబీడీసీకి సంబంధించి ఆఫ్​లైన్​ పేమెంట్లు, ప్రోగ్రామబుల్​ పేమెంట్లు, న్యూ మానిటరీ పాలసీ టూల్​కిట్​, ఫ్రాక్షనల్​ బ్యాంకింగ్​ సమస్యలు, ఫైనాన్షియల్​ ఇన్​క్లూజన్​, క్రాస్​ బార్డర్ ​సీబీడీసీ పేమెంట్లపై సెంట్రల్ ​బ్యాంకులకు సలహాలు ఇస్తున్నామని వివరించారు. తమ టెక్నాలజీ ద్వారా కమర్షియల్​ బ్యాంకులు సెంట్రల్​ బ్యాంక్​ డబ్బును డిజిటల్​ రెగ్యులేటెడ్​ డబ్బుగా మార్చుకోవచ్చని వివరించారు. సీబీడీసీ ఆర్​బీఐ  కంట్రోల్​లో ఉంటుంది. దీనిని పేపర్​ కరెన్సీగానూ మార్చుకోవచ్చు. ఆర్​బీఐ బ్యాలన్స్​ షీట్​లోనూ కనిపిస్తుంది. కాబట్టి దీనికి లీగల్​ కరెన్సీ హోదా వస్తుంది.