ఆర్సీ, లైసెన్స్ కార్డులు అందుతలేవ్ ..రిజిస్ట్రేషన్ జరిగి నెలలు దాటుతున్నా ఇంటికి చేరని కార్డులు

ఆర్సీ, లైసెన్స్ కార్డులు అందుతలేవ్ ..రిజిస్ట్రేషన్ జరిగి నెలలు దాటుతున్నా ఇంటికి చేరని కార్డులు
  • కొన్ని గల్లంతు, కొన్ని ఆఫీస్​కు రిటర్న్
  • ఏటా ఆఫీస్​కు చేరుతున్నవి 3 వేలకు పైగానే
  • వాహనదారులకు తప్పని ఇబ్బందులు

హనుమకొండ, వెలుగు: జిల్లాలోని వాహనదారులకు సరైన సమయంలో ఆర్సీలు, లైసెన్సులు అందడం లేదు. ఆర్టీఏ ఆఫీసుల్లో కార్డుల కొరత వేధిస్తుండగా.. మరో వైపు ప్రింట్ చేసిన కార్డులు ఓనర్లకు చేరడం లేదు. క్షేత్రస్థాయిలో పోస్టల్​ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కార్డులు వాహనదారుల ఇండ్లకు చేరకపోగా.. ఆర్టీఏ ఆఫీస్​ కు రివర్స్​ వచ్చి పోగుపడుతున్నాయి.  ఏటా వందల సంఖ్యలో కార్డులు ఇలా వెనక్కి వస్తుండగా.. కొన్ని మధ్యలోనే గల్లంతవుతున్నాయి. 

ఏటా మూడు వేల కార్డ్స్​ రివర్స్​

గ్రేటర్​ పరిధిలో ఉన్న హనుమకొండ జిల్లా ఆర్టీఏ ఆఫీసులో  రోజూ 40 నుంచి 50 వరకు వెహికల్​ రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. సగటున 15 వేలకు పైగా వాహనాలు పెరుగుతున్నాయి.  వెహికల్​కొనుగోలు చేసిన అనంతరం వాహనదారులు రిజిస్ట్రేషన్ కోసం స్లాట్​ బుక్​ చేసి, నిర్ధేశించిన తేదీన వెహికిల్​ వెరిఫికేషన్​ చేయించుకుంటున్నారు. ఈ ప్రక్రియ అనంతరం ఒకట్రెండు వారాల్లోగా సంబంధిత ఆర్సీ కార్డులు వాహనదారుల ఇండ్లకు చేరాల్సి ఉంటుంది.

ఆర్టీఏ అధికారులు ఈఎంఎస్​ స్పీడ్​ పోస్ట్ ద్వారా పంపిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆ కార్డులు ఐదారు రోజులు పోస్టాఫీస్​ లో ఉంటున్నాయి. దీంతో ఆర్సీలు, లైసెన్స్​ కార్డులు వాహనదారులకు చేరడంలో ఇబ్బందులు ఎదురవుతుండగా.. కొన్ని సందర్భాల్లో లొకేషన్​ ట్రేస్​ కావడం లేదనే కారణం చెబుతూ కార్డులను మళ్లీ డిస్ట్రిక్ట్ ట్రాన్స్​ పోర్ట్​ ఆఫీస్​ కే పంపిస్తున్నారు. ఇలా ప్రతి సంవత్సరం మూడు వేల వరకు కార్డులు మళ్లీ ఆర్టీఏ కార్యాలయానికే రిటర్న్​ గా వచ్చేస్తున్నాయి. వాహనదారులు నేరుగా ఆఫీస్​కు వెళ్లి కార్డులు కలెక్ట్​ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

కొన్ని కార్డులు గల్లంతు!

అటు పోస్టు ద్వారా ఇంటికి చేరక, మరోవైపు ఆర్టీఏ ఆఫీస్​ కు రిటర్న్​ రాక కార్డులు కనిపించకుండా పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో వాహనదారులు పలుమార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం ఉండటం లేదు.  ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వాహనదారులు మళ్లీ డూప్లికేట్​ కార్డుల కోసం అప్లికేషన్​ పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది.  ఇప్పటికే ఒరిజినల్​ ఆర్సీలు, లైసెన్స్​ లకే కార్డుల కొరత వేధిస్తుండగా, డూప్లికేట్​ కార్డుల కోసం దరఖాస్తులు వస్తుండటం  సమస్యగా మారుతోంది.  

కార్డు రాకపోతే ఆఫీసులో సంప్రదించొచ్చు

వాహనదారులకు సంబంధించిన ఆర్సీలు, లైసెన్స్​ కార్డులు వివిధ కారణాల వల్ల వెనక్కి వస్తున్న విషయం వాస్తవమే. వాటిని వాహనదారులకు అందజేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. రిజిస్ట్రేషన్​ పూర్తయిన రెండు, మూడు వారాలకు  కార్డులు అందకపోతే నేరుగా ఆర్టీఏ ఆఫీస్​ కు వచ్చి కలెక్ట్​ చేసుకోవచ్చు.  ఇతర సమస్యలు ఏమున్నా  మా దృష్టికి తీసుకొస్తే వాటిపైనా తగిన చర్యలు తీసుకుంటాం.- డా.పుప్పాల శ్రీనివాస్​, డీటీసీ, హనుమకొండ